శ్రీశుక ఉవాచ
కిమ్పురుషే వర్షే భగవన్తమాదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ
సన్నికర్షాభిరతః పరమభాగవతో హనుమాన్సహ కిమ్పురుషైరవిరతభక్తిరుపాస్తే
కింపురుష వర్షములో శ్రీరామచంద్రుడు ఆరాధించబడే దైవం. ఆరాధించే వాడు హనుమ. హనుమ కింపురుషునిగా పేరు పొందినవాడు. పరమాత్మ పాదముల యందే ప్రీతికలిగినవాడు, పరంభాగవతుడు తోటి కింపురుషులతో కలిసి స్వామిని ఆరాధిస్తున్నాడు
ఆర్ష్టిషేణేన సహ గన్ధర్వైరనుగీయమానాం పరమకల్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి
స్వయం చేదం గాయతి
ఓం నమో భగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత
లోకాయ నమః సాధువాదనికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి
ఈ మంత్రాన్ని ఉపాసించినందు వలన్ కీర్తీ సంపదా మనసుకు స్థైర్యం కలుగుతాయి. ఉత్తముల చేత కీర్తించబడే వాడు, సజ్జనులు ఎలాంటి స్వభావముతో ఉండి ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తారో అలాంటి ధర్మాన్ని ఆచరిస్తాడు. రామచంద్రుడు మూడు రకముల వృద్ధులను సేవించేవాడు 1. జ్ఞ్యాన వృద్ధులూ 2. శీల వృద్ధులూ 3. వయో వృద్ధులు. ఒక అస్త్ర విద్యకూ ఇంకో అస్త్ర విద్యకూ మధ్య ఉన్న విరామములో వీరిని సేవించేవాడు. అన్నీ నేర్చుకున్నవాడూ, ప్రజలను ఆరాధించిన వాడు, మంచివారికి ఒరిపిడి రాయి వంటి వాడు. బ్రాహ్మణులయందు ప్రీతి కలవారిని ఎక్కువ ఆరాధించేవాడు, బ్రాహ్మణుల యందు ప్రీతికలవాడు. మహా పురుషుడూ మహారాజు. ఈ మంత్రం వలన ఆయువూ స్థైర్యం కీర్తి లభిస్తాయి.
యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసా ధ్వస్తగుణవ్యవస్థమ్
ప్రత్యక్ప్రశాన్తం సుధియోపలమ్భనం హ్యనామరూపం నిరహం ప్రపద్యే
రామావతారం ఎవ్వరికీ అర్థం కాదు. అతి సామాన్యుడిగా ఒక సారి అతి మానుషుడుగా ఒక సారి కనిపిస్తాడు. స్వామి పరమాత్మా మానవుడా అన్నది ప్రశ్న కాదు. ఆయనను అనుభవించడమే ప్రయోజనం. తన దివ్య తేజస్సుతో ప్రకృతి ప్రభావాలను ధ్వంసం చేసినవాడు. తనకు మాత్రమే తెలిసిన ( ప్రత్యగాత్మ), ప్రశాంతుడు, జ్ఞ్యానం కలిగినవారికి లభించేవాడు. అనామరూపుడివి. అలాంటి స్వామికి నమస్కారం
మర్త్యావతారస్త్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోః
కుతోऽన్యథా స్యాద్రమతః స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య
మానవుడిగా అవతరించి ఆచరించిన పనులకు అర్థం, మనిషైనవాడు ఇలా ప్రవర్తించాలని నేర్పడానికే వచ్చాడు గానీ, రావణున్ని చంపడానికి మాత్రమే కాదు. ఒక వేళ రావణున్నే చంపడానికే వచ్చాడంటే, భార్యా వియోగం అరణ్యవాసం రామునికి ఎందుకొస్తాయి? మానవులకు పూర్వ జన్మ కృతముగా సుఖములు గానీ దుఃఖములు గానీ వస్తాయి.
న వై స ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్వాసుదేవః
న స్త్రీకృతం కశ్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి
జగత్తుని శాసించేవాడు తన చేత శాసించబడే వారి చేత బాధపడగలడా? అదంతా మన శిక్షణ గురించే. ఆయన ఆత్మ కలవారందరికీ మిత్రుడు. ఆత్మ జ్ఞ్యానం మనోనిగ్రహం కలవారికి. మనసు తన వశములో లేని వాడు సుఖమూ దుఃఖమునూ నియంత్రించలేడు. మనకు దైవకృతముగా కామమునకూ లోభమునకూ లొంగితే మనం మోహములో పడతాము. ఆశనూ లోభాన్నీ పోగొట్టుకున్నవాడిని ప్రకృతి శాసించదు
అరణ్యములో ప్రయాణిస్తున్న ఒక బ్రాహ్మణోత్తమునికి అప్పుడే చెట్టుమీద నుండి రాలిన ఒక పండు కనపడింది. ఆకలిగొన్న అతను అది చూసి స్నాన సంధ్యాదులు ముగించుకొని పరమాత్మకు అర్పించి ఆ పండు తాను తిన్నాడు. తినగానే తన వయసు సగం తగ్గింది, ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక అందమైన యువతి కనపడి నన్ను పెండ్లాడమని అడిగింది. సంతోషముగా ఆమెను స్వీకరించి ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక రాక్షసుడు నోరు తెరుచుకుని ఉన్నాడు. వీరిని చూచి మింగుతా అని అన్నాడు. బ్రాహ్మణుడు కారణమడుగగా "నీవు పండు పడితే తిన్నావు కదా. నాకు ఒక నియమం ఉంది, ఆ చెట్టు పండును తినీ, ఈ యువతిని పెళ్ళి చేసుకున్నవారిని తినాలి అని" అన్నాడు.
రాముడూ మనసు గలవారికీ ఆత్మ స్వరూపం తెలిసిన వారికీ మిత్రుడు. ఆయన మూడు లోకాలనూ సృష్టించినా ఆ మూడు లోకాలలో దేని మీదా ఆసక్తి లేదు. ఈయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఇలాంటి పరమాత్మ ఒక స్త్రీ కోసం దుఃఖాన్ని అనుభవిస్తాడా? నరునిగా అవతరించినా పరమాత్మ స్వరూపాన్ని వదులుకుంటాడా? స్వామిత్వాన్ని వదిలిపెట్టి భార్య దూరమవడం వలన దు@ఖించాడంటే అది మానవులకు ఈ జీవితం గురించి నేర్పడానికే
న జన్మ నూనం మహతో న సౌభగం న వాఙ్న బుద్ధిర్నాకృతిస్తోషహేతుః
తైర్యద్విసృష్టానపి నో వనౌకసశ్చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః
పరమాత్మ ఒక్కొక్క చర్యతో ఒక్కో ధర్మాన్నీ మనకు చెప్పాడు. సంపదా స్త్రీ ఆస్తి, వీటిని ప్రేమించినవాడికి దుఃఖం తప్పదు అని సీతా వియోగ సమయములో చూపించాడు. మనం ఈ లోకములో దేన్ని గూర్చి మనం గొప్పది అనుకుంటామో దానితో పరమాత్మకు సంబందం లేదు. ఉత్తం కులములో పుట్టడం కానీ, మహత్వం గానీ, సౌభగం గానీ, మంచి వాక్కూ బుద్ధీ రూపం, పాండిత్యం, సౌజన్యం, ఇవన్నీ పరమాత్మను సంతోషింపచేయజాలవు. ఒక్క భక్తి ఉంటే ఇవనీ ఉన్నట్లే లెక్క అని చెప్పాడు. పరమాత్మ రామావతారములో ఇవేవీ లేని వారితో స్నేహం చేసాడు. వానరులతో ఆటవికులతో పక్షులతో స్నేహం చేసాడు. మనకు తన స్వరూపాన్ని తెలిపాడు. పైన చెప్పిన వాటితో సంబంధం లేని వానరులతో స్నేహం చేసి ఆయన అనుగ్రహం పొందడానికి పైన చెప్పినవేమీ కారణాలు కావు అని నిరూపించాడు..
సురోऽసురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యః సుకృతజ్ఞముత్తమమ్
భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్కోసలాన్దివమితి
దేవత కానీ సురులు గానీ అసురులు గానీ నరులు గానీ వానరులు గానీ పరమాత్మ అయిన రామున్ని మనిషిగా సేవిస్తే తన లోకాన్నిచ్చాడు. ఆయనను సేవించని వారిని కూడా మోక్షానికి తీసుకుని వెళ్ళాడు. గడ్డిపరకకు కూడా మోక్షాన్నిచ్చాడు స్వామి. తానెంతమేరకూ తిర్గాడో ఆ భాగాన్నంతా మోక్షానికి తీసుకెళ్ళాడు. ఆయనను సేవించాలన్న బుద్ధి ఉంటే చాలు.
భారతేऽపి వర్షే భగవాన్నరనారాయణాఖ్య ఆకల్పాన్తముపచితధర్మజ్ఞాన
వైరాగ్యైశ్వర్యోపశమోపరమాత్మోపలమ్భనమనుగ్రహాయాత్మవతామనుకమ్పయా తపోऽవ్యక్తగతిశ్చరతి
భారత వర్షములో ఆరాధిచవలసిన దేవతలు నర నారాయణులు. వీరు కల్పం చివర దాకా ఉండి, ఉపచితధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమ. వృద్ధి పొందిన ధర్మ జ్ఞ్యాన వైరాగ్య ఇంద్రియ నిగ్రహ ఆత్మా రామం కలిగిన వారిని అనుగ్రహించడానికి, ఎలా తపస్సు చేయాలో మనకు చెప్పారు. ఎవరికీ అర్థం కాని సుధీర్ఘమైన తపస్సు కల్పాంతం దాకా చేస్తూ ఉంటాడు.
తం భగవాన్నారదో వర్ణాశ్రమవతీభిర్భారతీభిః ప్రజాభిర్భగవత్ప్రోక్తాభ్యాం సాఙ్ఖ్య
యోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణః పరమభక్తిభావేనోపసరతి ఇదం
చాభిగృణాతి
ఈ నర నారాయణులను నారదుడు ఆరాధిస్తాడు.
ఓం నమో భగవతే ఉపశమశీలాయోపరతానాత్మ్యాయ నమోऽకిఞ్చనవిత్తాయ ఋషిఋషభాయ
నరనారాయణాయ పరమహంసపరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి
పై వర్షాలలో వర్ణాలూ ఆశ్రమాలూ లేవు. కానీ ఈ వర్షములో వర్ణాశ్రమాలుంటాయి. గీతలో చెప్పినట్లుగా సాంఖ్యయోగముతో పరమాత్మను అనుభవించే విధానాన్ని సావర్ణి అనే మనువుకు ఇది వరకు భగవానుడు చెప్పిన సాంఖ్య యోగాన్ని ఉపదేశిస్తూ భాగవానుని ఆరాధిస్తాడు. ఈ మంత్రముతో స్తోత్రం చేస్తాడు.
నర నారాయణుల లక్షణం ఉపశమం - ఇంద్రియ నిగ్రహం. ఆనాత్మ్య భావమేమీ లేని వాడు. శారీరిక సంబంధములూ శరీర భావములూ శోక మోహ ఆకలీ దప్పీ జరా రోగమూ లేని వాడు. ఇవి కేవలం శరీరానికి ఉండేవే, ఆత్మకు కావు. తొలగిన శరీర సంబంధం కలవాడు.దరిద్రులకు ధనవంతుడు. ఋషులకు శ్రేష్టుడు. యోగులకు అధిపతి. అటువంటి స్వామికి నమస్కారం
గాయతి చేదమ్
కర్తాస్య సర్గాదిషు యో న బధ్యతే న హన్యతే దేహగతోऽపి దైహికైః
ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమోऽసక్తవివిక్తసాక్షిణే
సకల చరాచర జగత్తునీ సృష్టించి రక్షించి సంహరిస్తూ జగత్తులో ఉన్న దోషాలతో అంటబడని వాడు. శరీరములో ఉన్నా శరీరము లేకపోతే లేని వాడు కాడు. దేహధర్మాలతో (ఆకలీ దప్పి మొదలైనవి) ఆయన బాధించబడడు. చూచేవాడికి కనపడని వాడు. చూచేవాడికి ఇతను కన్ను కూడా కాడు.ఇది ప్రకృతి గుణములతో దూషించబడదు. అటువంటి స్వామికి నమస్కారం. దేనియందూ తగులు కొనడూ అన్నిటికంటే వేరుగా ఉంటూ అన్నిటినీ చూస్తూ ఉంటాడు - అసక్తవివిక్తసాక్షిణే
ఇదం హి యోగేశ్వర యోగనైపుణం హిరణ్యగర్భో భగవాఞ్జగాద యత్
యదన్తకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దధీతోజ్ఝితదుష్కలేవరః
ఇదే యోగ నైపుణ్యం ( చేసే పనులలో చాతుర్యం. చాతుర్యమంటే ఫలం అంటకుండా పని చేయడం). బతికున్నప్పుడు ఎలా ఉన్నా ప్రాణం పోయేప్పుడు ఎవరైతే పరమాత్మ నామాన్ని శరీరం యందు మోహాన్ని వదిలిపెట్టి మనసును భక్తితో నీయందు నిలిపి, స్మరిస్తాడో వాడు నిపుణుడు
యథైహికాముష్మికకామలమ్పటః సుతేషు దారేషు ధనేషు చిన్తయన్
శఙ్కేత విద్వాన్కుకలేవరాత్యయాద్యస్తస్య యత్నః శ్రమ ఏవ కేవలమ్
భార్యా పిల్లలూ ఆస్తి అన్నం సంపాదించుకోవడం వాటి గురించే ఆలోచించడం, "నేను చినపోతానేమో" అని ఆలోచిస్తూ ఉండి ఇహ పర లోకాలలో సుఖం కోసం వారు చేసే పని అంతా ఆయాసం తప్ప ఏమీ కాదు. చెడు శరీరం ఉన్నందు వలన రెండు రకాల భావాలు కలుగుతాయి. అహంకారం మమకారం. శరీరాన్ని నేను అనుకోవడం శరీరముతో వచ్చినవారిని నావారు అనుకోవడం.
తన్నః ప్రభో త్వం కుకలేవరార్పితాం త్వన్మాయయాహంమమతామధోక్షజ
భిన్ద్యామ యేనాశు వయం సుదుర్భిదాం విధేహి యోగం త్వయి నః స్వభావమితి
ఇవన్నీ చెడు శరీరముతో వచ్చినవే. వాటిని భేధించాలి. ఎంత కష్టపడ్డా ఈ భావాలను భేధించుకోలేము. వాటిని భేధించి నా మనసుని నీ యందు లగ్నం చేయి
భారతేऽప్యస్మిన్వర్షే సరిచ్ఛైలాః సన్తి బహవో మలయో మఙ్గలప్రస్థో మైనాకస్త్రికూట ఋషభః
కూటకః కోల్లకః సహ్యో దేవగిరిరృష్యమూకః శ్రీశైలో వేఙ్కటో మహేన్ద్రో వారిధారో విన్ధ్యః శుక్తిమానృక్షగిరిః
పారియాత్రో ద్రోణశ్చిత్రకూటో గోవర్ధనో రైవతకః కకుభో నీలో గోకాముఖ ఇన్ద్రకీలః కామగిరిరితి చాన్యే చ
శతసహస్రశః శైలాస్తేషాం నితమ్బప్రభవా నదా నద్యశ్చ సన్త్యసఙ్ఖ్యాతాః
ఏతాసామపో భారత్యః ప్రజా నామభిరేవ పునన్తీనామాత్మనా చోపస్పృశన్తి
ఇలాంటి భారత వర్షములో కూడా నదులూ నదములూ ఉన్నాయి. మలయ మంగల ప్రస్థ మైనాక ఋష్యమూక శ్రీశైల ద్రోణ చిత్రకూటా నీలా ఇంద్రకీల మొదలైన ముప్పై రెండు పర్వతాలున్నాయి భారత పర్వతములో
చన్ద్రవసా తామ్రపర్ణీ అవటోదా కృతమాలా వైహాయసీ కావేరీ వేణీ పయస్వినీ శర్కరావర్తా
తుఙ్గభద్రా కృష్ణావేణ్యా భీమరథీ గోదావరీ నిర్విన్ధ్యా పయోష్ణీ తాపీ రేవా సురసా నర్మదా చర్మణ్వతీ సిన్ధురన్ధః
శోణశ్చ నదౌ మహానదీ వేదస్మృతిరృషికుల్యా త్రిసామా కౌశికీ మన్దాకినీ యమునా సరస్వతీ దృషద్వతీ గోమతీ
సరయూ రోధస్వతీ సప్తవతీ సుషోమా శతద్రూశ్చన్ద్రభాగా మరుద్వృధా వితస్తా అసిక్నీ విశ్వేతి మహానద్యః
ఇవే కాక చిన్న చిన్న గుట్టలు లక్షల కొలదీ ఉన్నాయి. ఎన్ని పర్వతాలున్నాయో అలాగే నదులూ నదములూ లెక్కలేనన్నివి ఉన్నాయి. గంగా నది నామస్మరణ చేసినా చాలు. అలాంటి నది దగ్గరకు వెళ్ళి స్నానం చేసిన వారు పరమపవిత్రులవుతారు. ఈ నలభై రెండూ మహా నదులు.
అస్మిన్నేవ వర్షే పురుషైర్లబ్ధజన్మభిః శుక్లలోహితకృష్ణవర్ణేన స్వారబ్ధేన కర్మణా దివ్య
మానుషనారకగతయో బహ్వ్య ఆత్మన ఆనుపూర్వ్యేణ సర్వా హ్యేవ సర్వేషాం విధీయన్తే యథావర్ణ
విధానమపవర్గశ్చాపి భవతి
ఈ భారత వర్షములో ఉన్నవారు మంచి పనీ చెడు పనీ రెండూ కాని పనీ చేస్తూ (తెల్ల నల్ల ఎరుపు పనులు) మానవ దేవత తిర్యక్ జన్మలు ఎత్తుతూ
యోऽసౌ భగవతి సర్వభూతాత్మన్యనాత్మ్యేऽనిరుక్తేऽనిలయనే పరమాత్మని వాసుదేవేऽనన్య
నిమిత్తభక్తియోగలక్షణో నానాగతినిమిత్తావిద్యాగ్రన్థిరన్ధనద్వారేణ యదా హి మహాపురుషపురుష
ప్రసఙ్గః
ఆయా వర్ణాశ్రములకు విధించబడిన ధర్మం ఆచరించిన వారికి మోక్షమూ కైవల్యమూ వస్తాయి. అందరిలో ఉన్న పరమాత్మ, శరీర సంబంధం లేని వాడు, ఇలా ఉంటాడన్న లక్షణం గలిగినవాడు కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండే స్వభావముతో ఆచరించే అనేక పనుల వలన కలిగిన సంస్కారముతో ఏర్పడిన జన్మ జరాది దు@ఖాలను పోగొట్టడానికి పరమాత్మ మీద ఫలాకాంక్ష లేని భక్తి కారణం. ఈ భక్తి అవిద్యా గ్రంధిని పోగొడుతుంది . ఇలా అవ్వడానికి పరమాత్మ భక్తులతో సావాసం చేయాలి. భగవంతుని భక్తులతో కలిసి పరమాత్మ నామ సంకీర్తన చేస్తుంటే దేహం వలన వచ్చిన వాటితో ఏ ఇబ్బందీ ఉండదు.
ఏతదేవ హి దేవా గాయన్తి
అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః
యైర్జన్మ లబ్ధం నృషు భారతాజిరే ముకున్దసేవౌపయికం స్పృహా హి నః
ఇదే విషయాన్ని దేవతలు గానం చేస్తున్నారు. భారత వర్షములో జన్మించినవారెంత సుకృతం చేసుకున్నారు. వారి విషయములో పరమాత్మ ఎప్పుడూ ప్రసన్నముగా ఉంటాడు. ఇక్కడ జన్మించిన వారు పరమాత్మ సేవే ప్రయోజనముగా ఉంటారు. భారత దేశములో జన్మ భగవానుని సేవించడానికే ఉపయోగిస్తుంది. ఆయనను సేవించడానికి ఉపయోగపడే జన్మ ఎంత పుణ్యం చేస్తే రావాలి? మేము కూడా ఇక్కడ పుట్టి ఉండాలని కోరుకుంటున్నాము
కిం దుష్కరైర్నః క్రతుభిస్తపోవ్రతైర్దానాదిభిర్వా ద్యుజయేన ఫల్గునా
న యత్ర నారాయణపాదపఙ్కజ స్మృతిః ప్రముష్టాతిశయేన్ద్రియోత్సవాత్
స్వర్గమును పొందించే యజ్ఞ్య దాన తపములతో ఏమి లాభము. ఎక్కడైతే పరమాత్మ పాద పంకజములను స్మరించడం ఉండదో, అలాంటి ఇంద్రియ వ్యామోహము తుడిచిపెట్టకుండా ఉండే దాన ధర్మాలూ కర్తువూ ఉత్సవాల వలన ఏమి ప్రయోజనం. ఇంద్ర్యోత్సవాన్ని మరచిపోయి పరమాత్మ పాదాలను స్మరించని యజ్ఞ్య దాన తపములు వ్యర్థములు.
కల్పాయుషాం స్థానజయాత్పునర్భవాత్క్షణాయుషాం భారతభూజయో వరమ్
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్న్యస్య సంయాన్త్యభయం పదం హరేః
కల్పం ఆయుష్యముగా ఉండే ఇతరలోక నివాసముల కంటే క్షణ కాలము ఆయుషు ఉండే భారత వర్షములో ఆయువు సార్ధకం. ఇక్కడ ఒక క్షణ కాలం బతికినా ఆ క్షణ కాలములోనే సంసారం మీద విరక్తి కలిగి వైకుంఠానికి చేరగలడు.
న యత్ర వైకుణ్ఠకథాసుధాపగా న సాధవో భాగవతాస్తదాశ్రయాః
న యత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకోऽపి న వై స సేవ్యతామ్
పరమాత్మ కథలేని చోట సజ్జనులు లేని చోట భాగవతోత్తములు లేని చోట యజ్ఞ్య యాగాదులు లేని చోట, అది స్వర్గమైనా సరే దానిని సేవించకండి
ప్రాప్తా నృజాతిం త్విహ యే చ జన్తవో జ్ఞానక్రియాద్రవ్యకలాపసమ్భృతామ్
న వై యతేరన్నపునర్భవాయ తే భూయో వనౌకా ఇవ యాన్తి బన్ధనమ్
భారత వర్షముల్ (జ్ఞ్యాన క్రియల సమావేశముతో గల) మానవులుగా పుట్టి కూడా మరలా మానవులుగా పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నించనట్లతే వారు ఆరణ్య మృగముల వలె బంధనములు పొందుతారు {తురంగ (లేడి - శబ్దం) మాతంగ (ఏనుగు - స్పర్శ) పతంగ (మిడత రూప) మీన (రసం) బృంగ ( తుమ్మెద)}
యైః శ్రద్ధయా బర్హిషి భాగశో హవిర్నిరుప్తమిష్టం విధిమన్త్రవస్తుతః
ఏకః పృథఙ్నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణః స్వయమాశిషాం ప్రభుః
మానవుడు భగవానుని పేరుతో చేసే ఏ ఆరాధనైనా ఏ దేవత పేరు బెట్టినా ఏ పని చేసినా దానిని అందుకొనే వాడు పరమాత్మ ఒక్కడే. ఏ పేరుతో ఏ విధితో ఏ మంత్రముతో మన ఆహుతి చేసినా ఆ పరమాత్మే సంతోషముతో స్వీకరిస్తాడు. ఇచ్చేవాడు ఆయనే - స్వయమాశిషాం ప్రభుః
సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థదో యత్పునరర్థితా యతః
స్వయం విధత్తే భజతామనిచ్ఛతామిచ్ఛాపిధానం నిజపాదపల్లవమ్
మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే. కోరిక చావని మనకు కోరికే లేకుండా చేస్తాడు పరమాత్మ. ఆ శక్తి పరమాత్మ పాదాలకు ఉన్నది.
యద్యత్ర నః స్వర్గసుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనమ్
తేనాజనాభే స్మృతిమజ్జన్మ నః స్యాద్వర్షే హరిర్యద్భజతాం శం తనోతి
మనం ఈ లోకములో ఆచరించిన సత్యమూ యజ్ఞ్యమూ మొదలైన మంచి పనులూ పుణ్యాలకూ ఫల రూపముగా అజనాభ వర్షములో పూర్వ జన్మ్న జ్ఞ్యానం ఉన్న జన్మ ఉంటే చాలు. పూర్వ జన్మ జ్ఞ్యానం లేకున్నా జ్ఞ్యానమొక్కటి చాలు. అజనాభ వర్షములో పరమాత్మ తనను సేవించే వారికి మోక్షమిస్తాడు.
శ్రీశుక ఉవాచ
జమ్బూద్వీపస్య చ రాజన్నుపద్వీపానష్టౌ హైక ఉపదిశన్తి సగరాత్మజైరశ్వాన్వేషణ ఇమాం
మహీం పరితో నిఖనద్భిరుపకల్పితాన్
జంబూ ద్వీపానికి ఒక ఎనిమిది ఉప ద్వీపాలున్నాయి. సగర చక్రవర్తి యజ్ఞ్యం చేసినప్పుడు ఇంద్రుడు అశ్వాన్ని మాయం చేసినపుడు అరవై వేలమంది పుత్రులు దాన్ని వెతకడానికి పాతాళం వెళ్ళడానికి తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ తవ్వడములో ఎనిమిది ఉపద్వీపములు ఏర్పడ్డాయి.
తద్యథా స్వర్ణప్రస్థశ్చన్ద్రశుక్ల ఆవర్తనో రమణకో మన్దరహరిణః పాఞ్చజన్యః సింహలో
లఙ్కేతి
ఏవం తవ భారతోత్తమ జమ్బూద్వీపవర్షవిభాగో యథోపదేశముపవర్ణిత ఇతి
జంబూద్వీపముల సర్వ వర్షములూ వివరించాను.