ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం
శ్రీభగవానువాచ
మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః
ఆనన్దం పరమాత్మానమాత్మస్థం సముపైతి మామ్
ఈ కాయం నన్ను నిమిత్తముగా చేసుకుని వచ్చిన కాయం. ఇలాంటి శరీరాన్ని పొంది నా ధర్మాన్ని ఆచరిస్తూ ఆనందరూపములో ఉన్న ఆత్మలో ఉన్న పరమాత్మను పొందుతాడు
గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాననిష్ఠయా
గుణేషు మాయామాత్రేషు దృశ్యమానేష్వవస్తుతః
వర్తమానోऽపి న పుమాన్యుజ్యతేऽవస్తుభిర్గుణైః
జ్ఞ్యాన నిష్ఠతో ప్రకృతినుండి విడువడి, ఇవన్నీ మాయా మాత్రములుగా ఉండే గుణములు, లేనివి ఉన్నట్లుగా కనపడతాయి, ప్రకృతినుండి విడువడిన వాడు వసుత్భూతములైన గుణములతో సంబంధం ఏర్పరచుకోడు
సఙ్గం న కుర్యాదసతాం శిశ్నోదరతృపాం క్వచిత్
తస్యానుగస్తమస్యన్ధే పతత్యన్ధానుగాన్ధవత్
పొట్ట నింపుకోవాలని, కామం తీర్చుకోవాలనే రెండు మాయలకూ వశం ఐన వాడు ప్రకృతిలో బద్ధుడవుతాడు. శిశ్నోదరముల యందు ఆసక్తి గలవారి సంగమును వదలిపెట్టు
మనం మంచి వారం ఐనా స్త్రీ వ్యామోహం, జిహ్వా చాపల్యము గలవారితో కలసి ఉంటే, మనకు ఆ రెండూ లేకున్నా వారితో కలసి ఉండడం వలన, కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడి చేయి పట్టుకుని నడిచి , కళ్ళు ఉన్నవాడైనా చీకటిబావిలో పడినట్లు, అలాంటి వారితో సంగం చేసిన వాడు కూడా పతనమవుతాడు
ఐలః సమ్రాడిమాం గాథామగాయత బృహచ్ఛ్రవాః
ఉర్వశీవిరహాన్ముహ్యన్నిర్విణ్ణః శోకసంయమే
దానికి ఉదాహరణముగా చక్రవర్తి ఐన పురూరవుడి గాధలో ఆ తత్వం చెప్పబడింది
ఊర్వశి వెళ్ళిపోతే ఒంటిమీద బట్ట తెలియకుండా ఏడిచాడు. విరహముతో మోహం చెందాడు
త్యక్త్వాత్మానం వ్రయన్తీం తాం నగ్న ఉన్మత్తవన్నృపః
విలపన్నన్వగాజ్జాయే ఘోరే తిష్ఠేతి విక్లవః
నగ్నముగా ఉన్మత్తుడై పిచ్చివాడిలా తిరిగాడు. ప్రియురాలా నిర్దయురాలా , ఉండు ఉండూ అంటూ
కామానతృప్తోऽనుజుషన్క్షుల్లకాన్వర్షయామినీః
న వేద యాన్తీర్నాయాన్తీరుర్వశ్యాకృష్టచేతనః
ఎన్నో సంవత్సరాలూ రాత్రులూ ఆమెతో విహరించి సుఖించి కూడా వాడికి తృప్తి కలుగలేదు.
పోతున్నవీ వస్తున్నవీ తెలియలేదు. ఎన్ని సంవత్సరాలు గడిచాయి, ఎంత ఆయుష్షు పోతున్నదీ అన్నది తెలియలేదు.
ఊర్వశి చేత ఆకర్సించబడిన మనసు గలవాడై ఈ సందేశాన్ని ఇచ్చాడు
ఐల ఉవాచ
అహో మే మోహవిస్తారః కామకశ్మలచేతసః
దేవ్యా గృహీతకణ్ఠస్య నాయుఃఖణ్డా ఇమే స్మృతాః
కోరికలచేత మురికి పడ్డ మనసు గల నా మోహ విస్తారం ఎంత ఉంది? ఎంత ఆశ్చర్యం
ఊర్వశి చేత కౌగిలించుకోబడి నా ఆయుష్యములో భాగాలన్నీ గడిచిపోయాయని తెలియకపోయాను
నాహం వేదాభినిర్ముక్తః సూర్యో వాభ్యుదితోऽముయా
మూషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుత
నేను ఈమెతో ఉండి సూర్యోదయాన్నీ సూర్యోస్తమాన్నీ తెలుసుకోలేకపోయాను
ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిచాయో తెలియక పోయింది
అహో మే ఆత్మసమ్మోహో యేనాత్మా యోషితాం కృతః
క్రీడామృగశ్చక్రవర్తీ నరదేవశిఖామణిః
నా సమ్మోహం ఎటువంటిది. నా శరీరాన్నీ మనసునీ స్త్రీకే అర్పించాను. నేను చక్రవర్తిని అయి కూడా ఆడువారి చేతిలో ఆడుకునే మృగముగా మారాను. ఉన్న రాజులందరిలో ఉత్తమ పరిపాలకున్ని ఐన నేను ఊర్వశిచేత పరిపాలించబడ్డాను.
సపరిచ్ఛదమాత్మానం హిత్వా తృణమివేశ్వరమ్
యాన్తీం స్త్రియం చాన్వగమం నగ్న ఉన్మత్తవద్రుదన్
పరమాత్మను గడ్డి పరకలా చేసి, నన్ను నేను పూర్తిగా కప్పుకుని, వెళుతున్న స్త్రీ వెంట పిచ్చివాడిలా దిగంబరముగా పరిగెత్తి వెంబడించాను.
కుతస్తస్యానుభావః స్యాత్తేజ ఈశత్వమేవ వా
యోऽన్వగచ్ఛం స్త్రియం యాన్తీం ఖరవత్పాదతాడితః
అక్కడ ఏముంది? తేజస్సా ఈశత్వమా ప్రభుత్వమా?
గాడిదలా, ఆడ గాడిద వెంట మగగాడిద వెళ్ళినపుడు ఆడగాడిద వెనక కాళ్ళతో తన్నినా దాని వెనక వెళ్ళినట్లుగా జ్ఞ్యానం లేకుండా పిచ్చివాడిలా తిరిగాను
కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శ్రుతేన వా
కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనో హృతమ్
ఎందుకు నా విద్యా? నా తపస్సూ నా త్యాగం శాస్త్రమూ వివేకం మౌనమూ, స్త్రీ చేత అపహరించబడిన మనసు గలవాడికి ఇవన్నీ ఉండి ఏమి లాభం.
స్వార్థస్యాకోవిదం ధిఙ్మాం మూర్ఖం పణ్డితమానినమ్
యోऽహమీశ్వరతాం ప్రాప్య స్త్రీభిర్గోఖరవజ్జితః
నా స్వార్థం నాకు తెలియదు. నన్ను నేను పండితుడని అనుకుంటున్నాను. వాస్తవముగా మూర్ఖుడిని.
సకల లోకములకూ, ఇంద్రునికీ కూడా నేను సహాయం చేసాను. త్రైలోక్యాధిపత్యాన్ని పొందాను గానీ ఆడవారితో నేను ఒక దున్నపోతులాగ ఓడిపోయాను.
సేవతో వర్షపూగాన్మే ఉర్వశ్యా అధరాసవమ్
న తృప్యత్యాత్మభూః కామో వహ్నిరాహుతిభిర్యథా
ఊర్వశి యొక్క అధరామృతాన్ని కొన్ని సంవత్సరాలు సేవించినా మనసులో ఉన్న కోరిక తృప్తి పొందలేదు, ఆహుతులతో అగ్నిహోత్రం తృప్తి పొందనట్లుగా
పుంశ్చల్యాపహృతం చిత్తం కో న్వన్యో మోచితుం ప్రభుః
ఆత్మారామేశ్వరమృతే భగవన్తమధోక్షజమ్
వేశ్యతో అపహరించబడిన మనసును ఎవరు విడిపించుకోగలరు.
ఆత్మారాముడైన ఒక్క పరమాత్మ తప్ప, అధోక్షజుడు తప్ప (ఇంద్రియ వ్యాపారములను కిందుగా చేసేవాడు తప్ప) మరి ఎవడు చేయగలడు
బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన దుర్మతేః
మనోగతో మహామోహో నాపయాత్యజితాత్మనః
ఊర్వశి అప్పటికీ నాకు బోధించాలని ప్రయత్నించింది. దీనత్వం వలదని చెప్పి చూసింది. ఐనా నా మనసులో ఉన్న మోహం తొలగిపోలేదు
కిమేతయా నోऽపకృతం రజ్జ్వా వా సర్పచేతసః
ద్రష్టుః స్వరూపావిదుషో యోऽహం యదజితేన్ద్రియః
అసలు ఈ స్త్రీ రూపము మనకు చేయని అపకారమేది. వాస్తవానికి స్త్రీ కాదు అపకారం చేసింది. ఆ స్త్రీ వ్యామోహానికి వశుడైన పురుషుడు. తాడును పాము అనుకుని భయపడుతూ ఉంటే ఆ తప్పు తాడుదా భయపడిన వాడిదా. స్త్రీ నన్ను ఏమి చేయలేదు, స్త్రీ మీద వ్యామోహం పడడం నా పొరబాటు
క్వాయం మలీమసః కాయో దౌర్గన్ధ్యాద్యాత్మకోऽశుచిః
క్వ గుణాః సౌమనస్యాద్యా హ్యధ్యాసోऽవిద్యయా కృతః
ఈ శరీరమంతా మట్టీ, దుర్గంధభరితం. అలాంటి ఈ శరీరమెక్కడా, సౌమనస్య గుణాలెక్కడ? అవిద్యతో ఏర్పడినదే ఈ వ్యామోహం
పిత్రోః కిం స్వం ను భార్యాయాః స్వామినోऽగ్నేః శ్వగృధ్రయోః
కిమాత్మనః కిం సుహృదామితి యో నావసీయతే
ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ శరీరం ఎవరిది? తల్లి తండ్రులదా? నీదా? భార్యదా? యజమానిదా? అగ్నిదా? ఆ అగ్ని సంస్కారం లేకపోతే దాన్ని తినే కుక్కలదా గద్దలదా? మిత్రులదా?ఎవరిది
ఎవరిదో తెలియని ఈ శరీరన్ని ఇంకొకరికి అర్పించడం అజ్ఞ్యానమా జ్ఞ్యానమా
తస్మిన్కలేవరేऽమేధ్యే తుచ్ఛనిష్ఠే విషజ్జతే
అహో సుభద్రం సునసం సుస్మితం చ ముఖం స్త్రియః
అమేధ్యమైనది అపవిత్రమైందీ తుచ్చమైనది రాగముతో బద్ధమైన ఈ శరీరముతో అమ్మాయిని చూచి ఎంత బాగుంది అంటున్నాము. అది అంతా నిజమా?
త్వఙ్మాంసరుధిరస్నాయు మేదోమజ్జాస్థిసంహతౌ
విణ్మూత్రపూయే రమతాం కృమీణాం కియదన్తరమ్
శరీరం అంటే చర్మమూ మాంసమూ రక్తమూ నరములూ కొవ్వూ మధ్య ఎముకలు. వీటితో కూడి ఉన్న శరీరముతో , మల మూత్రములతో నిండి ఉన్న శరీరాన్ని చూచి,ఇవన్నీ ఉన్న స్త్రీ పురుషుల పరస్పరం రమించే గుణాన్ని చూస్తే మలములో రమించే పురుగులకూ వీరికీ తేడా ఏమిటి?
అథాపి నోపసజ్జేత స్త్రీషు స్త్రైణేషు చార్థవిత్
విషయేన్ద్రియసంయోగాన్మనః క్షుభ్యతి నాన్యథా
తెలుసుకున్నవాడు స్త్రీ సంబంధం ఉన్నవారితోనూ స్త్రీలతోనూ సంగం కలిగి ఉండరాదు
మనసుకు విషయములను ఇంద్రియములతో కలసినపుడే సంగం కలుగుతుంది. ఆ సంబంధం ఏర్పడినపుడే మనసు క్షోభ చెందుతుంది
అదృష్టాదశ్రుతాద్భావాన్న భావ ఉపజాయతే
అసమ్ప్రయుఞ్జతః ప్రాణాన్శామ్యతి స్తిమితం మనః
ఎన్నడూ చూడని దాని నుంచీ ఎన్నడూ వినని దానినుంచీ మనకు ఏ భావం కలుగదు
ఇంద్రియములను దేని యందూ లగ్నం చేయని వాడి మనసు ప్రశాంతముగా ఉంటుంది
తస్మాత్సఙ్గో న కర్తవ్యః స్త్రీషు స్త్రైణేషు చేన్ద్రియైః
విదుషాం చాప్యవిస్రబ్ధః షడ్వర్గః కిము మాదృశామ్
ప్రధానముగా సంగం కూడదు. విషయముల యందూ, స్త్రీ వ్యామోహం ఉన్నవారి యందు. పండితులకు కూడా షడ్వర్గం మోహం కలిగిస్తూ ఉంటే మావంటి వారికి కలిగించదా
శ్రీభగవానువాచ
ఏవం ప్రగాయన్నృపదేవదేవః స ఉర్వశీలోకమథో విహాయ
ఆత్మానమాత్మన్యవగమ్య మాం వై ఉపారమజ్జ్ఞానవిధూతమోహః
ఈ పురూరవుడు ఇలా పాడుతూ ఊర్వశీ లోకాన్ని విడిచిపెట్టి మనసును ఆత్మలో ఉంచి, జ్ఞ్యానముతో అన్ని మోహాలూ తొలగించుకుని నన్ను చేరాడు
తతో దుఃసఙ్గముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్
సన్త ఏవాస్య ఛిన్దన్తి మనోవ్యాసఙ్గముక్తిభిః
కాబట్టి బుద్ధి మంతుడైన వాడు దుస్సంగమును వదలిపెట్టి సత్సంగాన్ని చేయాలి
సత్పురుషులు తమ మాటలతో మనసు యొక్క వ్యాసంగాన్ని తొలగిస్తారు
సంసారముయందు ఆసక్తిని సత్పురుషులు తమ మాటలతో తొలగిస్తారు
సన్తోऽనపేక్షా మచ్చిత్తాః ప్రశాన్తాః సమదర్శినః
నిర్మమా నిరహఙ్కారా నిర్ద్వన్ద్వా నిష్పరిగ్రహాః
ఏ కోరికాలేనివారు, నా యందే మనసు ఉన్నవారు, గుణ త్రయముతో అభివ్యాప్తం కాని వారు, అంతటా నన్నే చూచేవారు
మమకారమూ అహంకారం ద్వంద్వాలూ లేని వారు, స్వీకారం లేనివారు
తేషు నిత్యం మహాభాగ మహాభాగేషు మత్కథాః
సమ్భవన్తి హి తా నౄణాం జుషతాం ప్రపునన్త్యఘమ్
ఇలాంటి వారి యందు నిరంతరం నా కథలే ఉంటాయి. వారిలో ఉండే నా కథలను సేవించినవారు పాపం పోగొట్టుకుని పవిత్రులవుతారు
తా యే శృణ్వన్తి గాయన్తి హ్యనుమోదన్తి చాదృతాః
మత్పరాః శ్రద్దధానాశ్చ భక్తిం విన్దన్తి తే మయి
వారితో ఏది వింటారో ఏది గానం చేస్తారో ఆదరముతో ఆమోదిస్తారో
నా యందే మనసు ఉంచి శ్రద్ధ గలవారై నాయందు వారికి భక్తి కలుగుతుంది
భక్తిం లబ్ధవతః సాధోః కిమన్యదవశిష్యతే
మయ్యనన్తగుణే బ్రహ్మణ్యానన్దానుభవాత్మని
భక్తి కలిగినవారికి ఇంక పొందవలసినదేముంది.ఇలాంటి నాయందు
యథోపశ్రయమాణస్య భగవన్తం విభావసుమ్
శీతం భయం తమోऽప్యేతి సాధూన్సంసేవతస్తథా
సూర్యున్ని సేవించిన వారికి చీకటీ చలీ భయం పోయినట్లుగా సాధువులను సేవించినవారికి, ప్రకృతీ తమస్సూ అహంకారం వంటి భయాలు పోతాయి
నిమజ్జ్యోన్మజ్జతాం ఘోరే భవాబ్ధౌ పరమాయణమ్
సన్తో బ్రహ్మవిదః శాన్తా నౌర్దృఢేవాప్సు మజ్జతామ్
ఘోరమైన సంసార సముద్రములో మునిగి తేలుతున్నవారికి సత్పురుషులే ఆధారం. బ్రహ్మజ్ఞ్యానం కలవారు, శాంతులు, నీటిలో మునుగుతున్నవారికి గట్టి పడవ దొరికితే ఎలా దాటిస్తుందో సంసారములో మునిగేవారికి సజ్జనులు లభిస్తే సంసారాన్ని దాటుతారు.
అన్నం హి ప్రాణినాం ప్రాణ ఆర్తానాం శరణం త్వహమ్
ధర్మో విత్తం నృణాం ప్రేత్య సన్తోऽర్వాగ్బిభ్యతోऽరణమ్
ప్రాణులకు ప్రాణం అన్నం
ఆర్తులకు శరణం నేను.
పరలోకములో మానవులకు ధర్మమే విత్తం
సంసారం అంటే భయపడేవారికి సజ్జనులే శరణ్యం
సన్తో దిశన్తి చక్షూంసి బహిరర్కః సముత్థితః
దేవతా బాన్ధవాః సన్తః సన్త ఆత్మాహమేవ చ
సూర్యుడు బయట వెలుగిచ్చి చూపుతాడు
సత్పురుషులు లోపల వెలుగు ఇస్తారు
హృదయములో ఉండే అంధకారాన్ని పోగొడతారు సత్పురుషులు
దేవతలౌ బయట బంధువులవంటి వారు, సత్పురుషులంటే నేనే
వైతసేనస్తతోऽప్యేవముర్వశ్యా లోకనిష్పృహః
ముక్తసఙ్గో మహీమేతామాత్మారామశ్చచార హ
ఈ విధముగా పురూరవుడు ఊర్వశి సంగము వలన లోకము యందు స్పృహ వదలిపెట్టి, అన్ని సంగములూ వదలిపెట్టి ఈ భూమిలో ఆత్మారాముడై సంచరించాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు