Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై నాలుగవ అధ్యాయం


                   ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై నాలుగవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
శ్రుత్వా పృథా సుబలపుత్ర్యథ యాజ్ఞసేనీ
మాధవ్యథ క్షితిపపత్న్య ఉత స్వగోప్యః
కృష్ణేऽఖిలాత్మని హరౌ ప్రణయానుబన్ధం
సర్వా విసిస్మ్యురలమశ్రుకలాకులాక్ష్యః

కృష్ణ పరమాత్మ భార్యలు చెప్పిన దాన్ని కుంతీ సుభద్రా ద్రౌపతీ మొదలైన ఇతర రాజుల భార్యలు కూడా విని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలతో ఆనందించారు

ఇతి సమ్భాషమాణాసు స్త్రీభిః స్త్రీషు నృభిర్నృషు
ఆయయుర్మునయస్తత్ర కృష్ణరామదిదృక్షయా

ఇలా వీరంతా మాట్లాడుతూ ఉండగా కృష్ణ రాములను చూడడానికి మునులందరూ వచ్చారు

ద్వైపాయనో నారదశ్చ చ్యవనో దేవలోऽసితః
విశ్వామిత్రః శతానన్దో భరద్వాజోऽథ గౌతమః

రామః సశిష్యో భగవాన్వసిష్ఠో గాలవో భృగుః
పులస్త్యః కశ్యపోऽత్రిశ్చ మార్కణ్డేయో బృహస్పతిః

ద్వితస్త్రితశ్చైకతశ్చ బ్రహ్మపుత్రాస్తథాఙ్గిరాః
అగస్త్యో యాజ్ఞవల్క్యశ్చ వామదేవాదయోऽపరే

ఇలాంటి వారందరూ వచ్చారు

తాన్దృష్ట్వా సహసోత్థాయ ప్రాగాసీనా నృపాదయః
పాణ్డవాః కృష్ణరామౌ చ ప్రణేముర్విశ్వవన్దితాన్

ఇందరు మునులు ఒక్క సారి రావడం చూచి కృష్ణ పరమాత్మ ఒక్క సారి లేచి నమస్కరించాడు
వారికి వారిగా వచ్చిన మునులకు అందరూ నమస్కరించారు
బలరామ కృష్ణులు వారిని పూజించారు

తానానర్చుర్యథా సర్వే సహరామోऽచ్యుతోऽర్చయత్
స్వాగతాసనపాద్యార్ఘ్య మాల్యధూపానులేపనైః

ఉవాచ సుఖమాసీనాన్భగవాన్ధర్మగుప్తనుః
సదసస్తస్య మహతో యతవాచోऽనుశృణ్వతః

సభలో ఉన్న వారంతా మౌనం వహించి శ్రద్ధగా వింటూ ఉండగా ధర్మమును కాపాడడానికి శరీరం స్వీకరించిన పరమాత్మ వారితో మాట్లాడుతున్నాడు

శ్రీభగవానువాచ
అహో వయం జన్మభృతో లబ్ధం కార్త్స్న్యేన తత్ఫలమ్
దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వరదర్శనమ్

ఇలా మేము ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాము. ఇంతకాలానికి జన్మకి పరిపూర్ణఫలం పొందాము. దేవతలకు కూడా కలుగని మీ దర్శనం మాకు కలిగింది.

కిం స్వల్పతపసాం నౄణామర్చాయాం దేవచక్షుషామ్
దర్శనస్పర్శనప్రశ్న ప్రహ్వపాదార్చనాదికమ్

కేవలం గుడిలో ఉన్న విగ్రహం మాత్రమే భగవంతుడు, తక్కినవారు భగవంతుడుకాదు అనుకునే వారు అల్ప తపస్సు చేసిన వారు. అలాంటి వారితో మాకేమి పని. గుడిలో ఉన్న విగ్రహానికి కాళ్ళు కడగలేము, మాట్లాడలేము, మాట్లాడలేము.

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః
తే పునన్త్యురుకాలేన దర్శనాదేవ సాధవః

నీరు మాత్రమే తీర్థము కాదు. మట్టి విగ్రహాలు మాత్రమే దేవతలు కాదు. ఎంతో కాలం గుడికి వెళితేనే గానీ ఫలితం కలుగదు. మీ వంటి వారు ఒక్క సారి చూస్తే చాలు పవిత్రులవుతాము.

నాగ్నిర్న సూర్యో న చ చన్ద్రతారకా
న భూర్జలం ఖం శ్వసనోऽథ వాఙ్మనః
ఉపాసితా భేదకృతో హరన్త్యఘం
విపశ్చితో ఘ్నన్తి ముహూర్తసేవయా

అగ్నీ సూర్యుడూ చంద్రుడూ నక్షత్రాలూ భూమీ జలం వాయువూ వాక్కూ మనసూ, ఇవన్నీ ఎంతో కాలం ఉపాసిస్తే కానీ పాపం పోదు. ఒక్క క్షణ కాలం పెద్దలను సేవిస్తేనే చాలు పాపం పోతుంది. భాగవతతోత్తముల దర్శనం అటువంటిది.

యస్యాత్మబుద్ధిః కుణపే త్రిధాతుకే
స్వధీః కలత్రాదిషు భౌమ ఇజ్యధీః
యత్తీర్థబుద్ధిః సలిలే న కర్హిచిజ్
జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరః

వాత కఫ పిత్తములు అనే మూడు గుణములు ఉన్న శరీరం యందు ఆత్మ బుద్ధి కలవారు. భార్యా పుత్రాదులు నావాళ్ళూ అనుకుంటారు. వారి యందు నా అనే బుద్ధి. విగ్రహాలను పట్టుకుని పూజార్హములు అనుకుంటారు. నీళ్ళను చూచి తీర్థము అనుకుంటారు. ఇలా అనుకునే వారు ఒక ఎద్దూ గాడిదా వంటివారు. గోవులలో గాడిద వంటివాడు. గోవులకు కావలసిన ద్రవ్యాన్ని మోసుకు వచ్చే గాడిదల వంటివాడు. అంటే చేసేది పుణ్యమే గానీ, అది పుణ్యం అని వాడికి తెలియదు. గాడిదలకు అవి చేసేది పుణ్యం అని తెలియదు. బరువు మాత్రం తెలుసుతుంది. అది జ్ఞ్యానం లేని ఆరాధన.

శ్రీశుక ఉవాచ
నిశమ్యేత్థం భగవతః కృష్ణస్యాకుణ్థమేధసః
వచో దురన్వయం విప్రాస్తూష్ణీమాసన్భ్రమద్ధియః

భగవానుని మాటలు విన్నారు మునులు. ఏమి చెప్పాలో అర్థం కాలేదు వారికి.  చాలా సేపు తమలో తాము ఆలోచించుకుని

చిరం విమృశ్య మునయ ఈశ్వరస్యేశితవ్యతామ్
జనసఙ్గ్రహ ఇత్యూచుః స్మయన్తస్తం జగద్గురుమ్

సకల లోకాలనూ పరిపాలించే స్వామి పరిపాలింపబడేవానిలాగ మాట్లాడాడు.
ఇదంతా చుట్టుపక్కల ఉన్నవారికి నేర్పడానికి మాట్లాడాడు. అని వారికి అర్థమయ్యింది

శ్రీమునయ ఊచుః
యన్మాయయా తత్త్వవిదుత్తమా వయం విమోహితా విశ్వసృజామధీశ్వరాః
యదీశితవ్యాయతి గూఢ ఈహయా అహో విచిత్రమ్భగవద్విచేష్టితమ్

ప్రజాపతులకు కూడా మేము అధిపతులం. అటువంటి వారమైన మేము కూడా మోహపడ్డాము. తత్వజ్ఞ్యానం కలవారిలో ఉత్తములుగా అందరిచే పేరుబడిన మేము కూడా మోహములో పడ్డాము.
అఖిలాండ కోటి బ్రహ్మానడములను శాసించే నీవు శాసింపబడేవాడిలా మాట్లాడడం నీ లీల.

అనీహ ఏతద్బహుధైక ఆత్మనా సృజత్యవత్యత్తి న బధ్యతే యథా
భౌమైర్హి భూమిర్బహునామరూపిణీ అహో విభూమ్నశ్చరితం విడమ్బనమ్

ఏ కోరికా లేని మీరు జగత్తును సృష్టిస్తూ రక్షిస్తూ సంహరిస్తూ ఉన్నారు. భూమి యొక్క పరాగాలని గాలి లేపుతుంది. ఆ లేపినటువంటి దుమ్ము గాలికి అంటుతుందా.
అలాగే ఇన్ని పనులు చేస్తున్న నీకు ఈ ప్రకృతి యొక్క గుణ త్రయం అంటదు.నీ చరిత్ర మహా విచిత్రం

అథాపి కాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్త్వం ఖలనిగ్రహాయ చ
స్వలీలయా వేదపథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుషః పరో భవాన్

నీ లీఅలతో నీ వారిని కాపాడడానికి సత్వ రూపం తీసుకుంటావు. దుష్టులను శిక్షించడానికీ, సనాతమైన మార్గాన్ని, వేద మార్గాన్నీ, వర్ణాశ్రమ ఆచారాలనూ కాపాడడానికి పరమ పురుషుడవి కూడా రూపాన్ని ధరించి అవతరిస్తావు

బ్రహ్మ తే హృదయం శుక్లం తపఃస్వాధ్యాయసంయమైః
యత్రోపలబ్ధం సద్వ్యక్తమవ్యక్తం చ తతః పరమ్

ఇదంతా నీ హృదయమే. వేదం నీ హృదయం. నీ స్వరూప స్వభావాలు ఎక్కడ లభిస్తాయో ఆ వేదం కూడా నీ అనుగ్రహం ఉంటేనే అర్థమవుతుంది.

తస్మాద్బ్రహ్మకులం బ్రహ్మన్శాస్త్రయోనేస్త్వమాత్మనః
సభాజయసి సద్ధామ తద్బ్రహ్మణ్యాగ్రణీర్భవాన్

అలాంటి నీవు బ్రాహ్మణులు కనపడితే వినపడితే వారిని పూజిస్తున్నావు. బ్రాహ్మణులంటే నీకు ఇష్టం అని లోకానికి చాటి చెబుతున్నావు

అద్య నో జన్మసాఫల్యం విద్యాయాస్తపసో దృశః
త్వయా సఙ్గమ్య సద్గత్యా యదన్తః శ్రేయసాం పరః

ఇవాళ్టికి మా జన్మ ధన్యమయ్యింది. మా విద్యా తపస్సూ జ్ఞ్యానమూ అంతః బహి శ్రేయస్సులన్ని ఫలించాయి.

నమస్తస్మై భగవతే కృష్ణాయాకుణ్ఠమేధసే
స్వయోగమాయయాచ్ఛన్న మహిమ్నే పరమాత్మనే

అకుంఠ మేధస్సు గలిగిన నీవు నీ యోగ మాయతో నీ మహిమను నీవే కప్పి పుచ్చుకున్నావు.

న యం విదన్త్యమీ భూపా ఏకారామాశ్చ వృష్ణయః
మాయాజవనికాచ్ఛన్నమాత్మానం కాలమీశ్వరమ్

ఈ రాజులు కానీ యాదవులు కానీ నిన్ను తెలుసుకోలేరు. మాయ అనే తెరతో కప్పిపుచ్చబడి ఉన్న నిన్ను తెలుసుకోలేరు

యథా శయానః పురుష ఆత్మానం గుణతత్త్వదృక్
నామమాత్రేన్ద్రియాభాతం న వేద రహితం పరమ్

నిదురపోతున్న వాడికి తన ఊరూ పేరూ కులం గోత్రం, తానెక్కడ ఉన్నాడో తెలుస్తుందా. అలాగే నీ మాయతో నీవవరవో కూడా ఎవరికీ తెలియదు

ఏవం త్వా నామమాత్రేషు విషయేష్విన్ద్రియేహయా
మాయయా విభ్రమచ్చిత్తో న వేద స్మృత్యుపప్లవాత్

కాబట్టి ఇలా విషయముల యందూ ఇంద్రియముల యందూ కోరికతో నీ మాయతో మనసు భ్రమను పొంది వాస్తవాన్ని తెలుసుకోలేక స్మృతి భంగం కలుగుతుంది

తస్యాద్య తే దదృశిమాఙ్ఘ్రిమఘౌఘమర్ష
తీర్థాస్పదం హృది కృతం సువిపక్వయోగైః
ఉత్సిక్తభక్త్యుపహతాశయ జీవకోశా
ఆపుర్భవద్గతిమథానుగృహాన భక్తాన్

అన్ని పాపాలూ పోగొట్టే నీ పాద పద్మాన్ని ఈనాడు చూడగలిగాము. చక్కగా పక్వం ఉన్న యోగం గల వారికి మాత్రమే హృదయములో ఉంచుకోదగిన నీ పాదాలను చూడగలిగాము.
భక్తి చేత జీవ కోశం, వాసనా కర్మా సంస్కారం తొలగించబడి, పూర్వ జన్మ వాసనా గ్రంధులు తొలగించబడతాయి.

శ్రీశుక ఉవాచ
ఇత్యనుజ్ఞాప్య దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరమ్
రాజర్షే స్వాశ్రమాన్గన్తుం మునయో దధిరే మనః

ఇలా చెప్పి మునులంతా తమతమ ఆశ్రమాలకు వెళ్ళదలచుకున్నారు.

తద్వీక్ష్య తానుపవ్రజ్య వసుదేవో మహాయశాః
ప్రణమ్య చోపసఙ్గృహ్య బభాషేదం సుయన్త్రితః

మన ఇంటికి అనుకోకుండానే పెద్దలు వచ్చినపుడు వారితో కలసి ఏదైనా గొప్ప భగవత్సేవా కార్యక్రమాలు జరపాలి.
ఇంతటి మునులందరూ రావడమే విశేషం. అందుకు వసుదేవుడు ఇలా అన్నాడు

శ్రీవసుదేవ ఉవాచ
నమో వః సర్వదేవేభ్య ఋషయః శ్రోతుమర్హథ
కర్మణా కర్మనిర్హారో యథా స్యాన్నస్తదుచ్యతామ్

మీకు నమస్కారం.నాకు ఒక సందేహం ఉంది. చేసిన పాపాలూ తప్పులూ ఇలాంటి వాటిని అన్నిటినీ పోగొట్టే ఇంకేదైనా కర్మ ఉంటే చెప్పండి. అలాంటి ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది

శ్రీనారద ఉవాచ
నాతిచిత్రమిదం విప్రా వసుదేవో బుభుత్సయా
కృష్ణమ్మత్వార్భకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః

కృష్ణుని తండ్రి మన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంటే, తన కుమారుడు పిల్లవాడు అని భావించి మన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు

సన్నికర్షోऽత్ర మర్త్యానామనాదరణకారణమ్
గాఙ్గం హిత్వా యథాన్యామ్భస్తత్రత్యో యాతి శుద్ధయే

ఎప్పుడూ దగ్గరే ఉండడం అనాదరణకు నమస్కారం. బాగా పరిచయమైతే అనాదరణం వస్తుంది. మలయపర్వత ప్రాంతములో గిరిజన యువతులు చందనపు కట్టెలతో వంట చేసుకుంటారు.
గంగా తీరములో ఉండేవారు, ఇదంతా మురికి నీరని ఇంకో జలం వద్దకు వెళతారు శుద్ధికోసం.

యస్యానుభూతిః కాలేన లయోత్పత్త్యాదినాస్య వై
స్వతోऽన్యస్మాచ్చ గుణతో న కుతశ్చన రిష్యతి

ప్రపంచములో కాలముతో కానీ ప్రళయముతో కానీ ఉత్పత్తితో గానీ తనతో గానీ ఇతరత్రా గానీ గుణములతో గానీ మరిదేనితో కూడా ఈ అనుభూతి నశించదో అలాంటి దాన్ని దగ్గర పెట్టుకుని కూడా మనదగ్గరకు వచ్చాడు. ఇది పరమాత్మ యొక్క మోహం. పరమాత్మ మోహం రెండు రకాలుగా ఉంటుంది. ఆయన కల్పించినదీ, మన అహంకారముతో వచ్చినదీ.

తం క్లేశకర్మపరిపాకగుణప్రవాహైరవ్యాహతానుభవమీశ్వరమద్వితీయమ్
ప్రాణాదిభిః స్వవిభవైరుపగూఢమన్యో మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగైః

కష్టములూ కర్మలూ కర్మ పరిపాకములూ, (వాసనలు) గుణ ప్రవాహం (సత్వాది గుణాలు) వీటితో కొట్టబడని అనుభవం కల స్వామిని,  అలాంటి వాడిని మబ్బు వస్తే సూర్యుడిని మబ్బు కమ్మేసింది అని అనుకున్నట్లు, చూడలేకపోతున్నారు

అథోచుర్మునయో రాజన్నాభాష్యానల్సదున్దభిమ్
సర్వేషాం శృణ్వతాం రాజ్ఞాం తథైవాచ్యుతరామయోః

ఇలా అనుకుని బలరామ కృష్ణులూ అందరూ వింటూ ఉండగా వసుదేవునితో ఇలా చెప్పాడు

కర్మణా కర్మనిర్హార ఏష సాధునిరూపితః
యచ్ఛ్రద్ధయా యజేద్విష్ణుం సర్వయజ్ఞేశ్వరం మఖైః

సకల యజ్ఞ్య రూపమైన స్వామిని యజ్ఞ్యములతో ఆరాధించుటే అన్ని పాపాలకూ ప్రాయశ్చిత్తం

చిత్తస్యోపశమోऽయం వై కవిభిః శాస్త్రచక్షుసా
దర్శితః సుగమో యోగో ధర్మశ్చాత్మముదావహః

శాస్త్ర జ్ఞ్యానం కలవారు మనసుకు శాంతిగా ఉంచుకోవడానికి ఇదే మార్గము.

అయం స్వస్త్యయనః పన్థా ద్విజాతేర్గృహమేధినః
యచ్ఛ్రద్ధయాప్తవిత్తేన శుక్లేనేజ్యేత పూరుషః

ఇది శుభాన్ని కలిగించే మార్గము. గృహస్థులైన బ్రాహ్మణునికి ఇదే ఉత్తమ మార్గము
శ్రద్ధతో, శ్రద్ధతో లభించిన ధనముతో, తెల్ల ధనముతో పరమాత్మను పూజించాలి.

విత్తైషణాం యజ్ఞదానైర్గృహైర్దారసుతైషణామ్
ఆత్మలోకైషణాం దేవ కాలేన విసృజేద్బుధః
గ్రామే త్యక్తైషణాః సర్వే యయుర్ధీరాస్తపోవనమ్

దారేషణా ధనేషణా పుత్రేషణా అని మూడు ఉంటాయి. ఇక్కడ లోకేషణ అని కూడా చెప్పబడినది. ఉత్తమలోకాలు పొందాలి అన్న కోరిక. విత్తేషణా ధారేషణ లోకేషణ. ఈ మూటితో సంసారములో పడుతున్నాము. యజ్ఞ్యములతో దానములతో విత్తేషణను వదులుకోవాలి. అంటే త్యాగముతో ధనము మీద ఆశను వదులుకోవాలి. గృహస్థశ్రమముతో దారేషణా పుత్రేషణా పోతుంది. ఇతర స్త్రీకామము గృహస్థాశ్రమముతో పోతుంది. కాలమును  పరిశీలించడముతో ఆత్మేషణా లోకేషణా పోగొట్టుకోవాలి. ఈ లోకములో ఒక పని చేసి, చేసిన పని వలన వచ్చిన ఫలితాన్ని చూచి, ఇదంతా అశాశ్వతం అని తెలుసుకోవాలి. మనం కష్టపడి పొందిన, మన ప్రయత్నముతో పొందిన ఫలితం ఇహ లోకములో ఎలా నశిస్తుందో స్వర్గము కూడా అలాగే నశిస్తుంది.
గ్రామం మీద కోరిక పోవాలంటే తపోవనానికి వెళ్ళాలి.

ఋణైస్త్రిభిర్ద్విజో జాతో దేవర్షిపితౄణాం ప్రభో
యజ్ఞాధ్యయనపుత్రైస్తాన్యనిస్తీర్య త్యజన్పతేత్

ప్రతీ ద్విజుడూ దేవ పితృ ఋసి ఋణాలతో పుడతాడు. యజ్ఞ్యం చేసి దేవ ఋణాన్నీ అధ్యయనం చేసి ఋషి ఋణాన్ని, పుత్రులతో పితృ ఋణాన్నీ తీర్చుకోవాలి. ఈ మూడు ఋణాలూ తీర్చుకోని వాడు పతితుడవుతాడు

త్వం త్వద్య ముక్తో ద్వాభ్యాం వై ఋషిపిత్రోర్మహామతే
యజ్ఞైర్దేవర్ణమున్ముచ్య నిరృణోऽశరణో భవ

నీవు ఋషి ఋణాన్ని పితృ ఋణాన్ని తీర్చుకున్నావు. దేవ ఋణం మాత్రం తీరలేదు
యజ్ఞ్యములతో ఈ దేవ ఋణాన్ని తీర్చుకుని నీవు ఉత్తమ గతిని పొందు

వసుదేవ భవాన్నూనం భక్త్యా పరమయా హరిమ్
జగతామీశ్వరం ప్రార్చః స యద్వాం పుత్రతాం గతః

నీవు పరమ భక్తితో పరమాత్మను ఆరాధించావు. అందువలన ఆయనే నీకు పుత్రునిగా పుట్టాడు. ఒక్క యజ్ఞ్యం చేస్తే నీకు దేవ ఋణం తీరుతుంది.

శ్రీశుక ఉవాచ
ఇతి తద్వచనం శ్రుత్వా వసుదేవో మహామనాః
తానృషీనృత్విజో వవ్రే మూర్ధ్నానమ్య ప్రసాద్య చ

అపుడు వసుదేవుడు ఆ ఋషులనే ఋత్విక్కులుగా ఉండి యజ్ఞ్యమును చేయించమని ప్రార్థిస్తే

త ఏనమృషయో రాజన్వృతా ధర్మేణ ధార్మికమ్
తస్మిన్నయాజయన్క్షేత్రే మఖైరుత్తమకల్పకైః

ఉత్తమ కల్పానుగుణముగా ఆ ఋషులు వసుదేవునితో యజ్ఞ్యం చేయించారు

తద్దీక్షాయాం ప్రవృత్తాయాం వృష్ణయః పుష్కరస్రజః
స్నాతాః సువాససో రాజన్రాజానః సుష్ఠ్వలఙ్కృతాః

యజ్ఞయం జరడం అంటే పండుగ. అలాగే రాజులందరూ ఆ దీక్ష జరుగుతున్నపుడు స్నానం చేసి కొత్త వస్త్రాలు కట్టుకుని పుష్పమాలలు ధరించి ఆభరణాలు ధరించి పుష్ప ఫలాలు తీసుకుని వచ్చారు. మంగళ వాద్యాలు మోగాయి. అప్సరసలు నట్యమూ సూత మాగధులు స్తోత్రమూ గంధర్వులు గానమూ చేసారు

తన్మహిష్యశ్చ ముదితా నిష్కకణ్ఠ్యః సువాససః
దీక్షాశాలాముపాజగ్మురాలిప్తా వస్తుపాణయః

నేదుర్మృదఙ్గపటహ శఙ్ఖభేర్యానకాదయః
ననృతుర్నటనర్తక్యస్తుష్టువుః సూతమాగధాః
జగుః సుకణ్ఠ్యో గన్ధర్వ్యః సఙ్గీతం సహభర్తృకాః

తమభ్యషిఞ్చన్విధివదక్తమభ్యక్తమృత్విజః
పత్నీభిరష్టాదశభిః సోమరాజమివోడుభిః

అసుదేవుడు తనకున్న 18 భార్యలతో సహా నక్షత్రాలతో ఉన్న చంద్రుని అభిషేకించినట్లుగా వసుదేవున్ని అభిషేకించారు

తాభిర్దుకూలవలయైర్హారనూపురకుణ్డలైః
స్వలఙ్కృతాభిర్విబభౌ దీక్షితోऽజినసంవృతః

పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించుకుని ఉన్నారు.

తస్యర్త్విజో మహారాజ రత్నకౌశేయవాససః
ససదస్యా విరేజుస్తే యథా వృత్రహణోऽధ్వరే

ఇంద్రుని యాగములోలాగ అందరూ కలసి బాగా జరిపారు

తదా రామశ్చ కృష్ణశ్చ స్వైః స్వైర్బన్ధుభిరన్వితౌ
రేజతుః స్వసుతైర్దారైర్జీవేశౌ స్వవిభూతిభిః

బలరామ కృష్ణులు తమ బంధువులతో కలసి జీవాత్మ పరమాత్మ తమ విభూతులతో కలసి ఉన్నట్లుగా బలరామ కృష్ణులు తమ బంధువులతో కలసి శోభించారు.

ఈజేऽనుయజ్ఞం విధినా అగ్నిహోత్రాదిలక్షణైః
ప్రాకృతైర్వైకృతైర్యజ్ఞైర్ద్రవ్యజ్ఞానక్రియేశ్వరమ్

అనుయజ్ఞ్యాన్ని కూడా చేసారు.ప్రాకృత వైకృత యజ్ఞ్యాలు కూడా చేసారు. ద్రవ్య జ్ఞ్యా క్రియాధి పతి ఐన స్వామిని ఆరాధించారు

అథర్త్విగ్భ్యోऽదదాత్కాలే యథామ్నాతం స దక్షిణాః
స్వలఙ్కృతేభ్యోऽలఙ్కృత్య గోభూకన్యా మహాధనాః

యజ్ఞ్యం పూర్తి చేసిన తరువాత ఏ యజ్ఞ్యమునకు దక్షిణ ఎంతెంత ఇవ్వాలని విధించబడినదో అటువంటి దక్షిణ ఇచ్చారు. గో భూ దానాలు చేసారు

పత్నీసంయాజావభృథ్యైశ్చరిత్వా తే మహర్షయః
సస్నూ రామహ్రదే విప్రా యజమానపురఃసరాః

ఋషులూ యజమానీ కలసి అవబృద స్నానం చేసారు.

స్నాతోऽలఙ్కారవాసాంసి వన్దిభ్యోऽదాత్తథా స్త్రియః
తతః స్వలఙ్కృతో వర్ణానాశ్వభ్యోऽన్నేన పూజయత్

పరశురామ హ్రదములో అందరూ స్నానం చేసారు

బన్ధూన్సదారాన్ససుతాన్పారిబర్హేణ భూయసా
విదర్భకోశలకురూన్కాశికేకయసృఞ్జయాన్

సదస్యర్త్విక్సురగణాన్నృభూతపితృచారణాన్
శ్రీనికేతమనుజ్ఞాప్య శంసన్తః ప్రయయుః క్రతుమ్

వచ్చిన రాజులనూ సదస్యులనూ ఋత్విక్కులనూ దేవతలూ అందరూ యజ్ఞ్యములో పాల్గొని , వెళ్ళేప్పుడు శ్రీనికేతుడైన స్వామి కృష్ణుడి అనుమతి తీసుకుని తమ తమ ఇళ్ళకు వెళ్ళారు

ధృతరాష్ట్రోऽనుజః పార్థా భీష్మో ద్రోణః పృథా యమౌ
నారదో భగవాన్వ్యాసః సుహృత్సమ్బన్ధిబాన్ధవాః

దృతరాష్ట్రుడూ విదురుడూ కుంతీ పుత్రులూ మొదలైనవారు

బన్ధూన్పరిష్వజ్య యదూన్సౌహృదాక్లిన్నచేతసః
యయుర్విరహకృచ్ఛ్రేణ స్వదేశాంశ్చాపరే జనాః

బంధువ్లను పరస్పరం వెళ్ళే ముందు ఆలింగనం చేసుకుని ప్రేమ భారముతో మనసు భారమై వారు ఎడబాటు వలన వచ్చిన దుఃఖముతో వారి వారి దేశాలకు వెళ్ళారు

నన్దస్తు సహ గోపాలైర్బృహత్యా పూజయార్చితః
కృష్ణరామోగ్రసేనాద్యైర్న్యవాత్సీద్బన్ధువత్సలః

నందుడు దగ్గరవాడు కాబట్టి ఆయనను విశేషముగా పూజించారు. ప్రియస్నేహితులు కాబట్టి నందుడు కొన్నాళ్ళు ఉన్నాడు

వసుదేవోऽఞ్జసోత్తీర్య మనోరథమహార్ణవమ్
సుహృద్వృతః ప్రీతమనా నన్దమాహ కరే స్పృశన్

వసుదేవుడు ఇంత పెద్ద కోరికను సులభముగా పొందాడు.ఋషులను చూడడమూ, వారు ఇంటికి రావడం, ఇంతకాలం ఉండడం జరిగాయి
సంతోషముతో నందుని హస్తాన్ని పట్టుకుని అన్నాడు

శ్రీవసుదేవ ఉవాచ
భ్రాతరీశకృతః పాశో నృనాం యః స్నేహసంజ్ఞితః
తం దుస్త్యజమహం మన్యే శూరాణామపి యోగినామ్

స్నేహం అనునది పరమాత్మ చేత ఏర్పరచిన పాశము. సురులూ యోగులూ కూడా విడిపించుకోలేనిది ఈ పాశము

అస్మాస్వప్రతికల్పేయం యత్కృతాజ్ఞేషు సత్తమైః
మైత్ర్యర్పితాఫలా చాపి న నివర్తేత కర్హిచిత్

మన మైత్రి పరస్పర కృతం. ఇలా చేసిన దాన్ని బట్టి ఆలోచించుకున్నా, ఉన్న స్నేహం బట్టి ఆలోచించుకున్నా కృతజ్ఞ్యతతో ప్రత్యుపకారముతో తొలగిపోయేది కాదు

ప్రాగకల్పాచ్చ కుశలం భ్రాతర్వో నాచరామ హి
అధునా శ్రీమదాన్ధాక్షా న పశ్యామః పురః సతః

కంసుడు ఉన్న రోజుల్లో మనసులో ఎంత ప్రీతి ఉన్నా ఏమీ చేయలేక చూస్తూ ఊరుకున్నాము. ఇపుడు సంపదలు ఎక్కువై చూడట్లేదు. అపుడు బాధలు ఎక్కువై చూడలేదు, ఇపుడు సంపదలు ఎక్కువై చూడడం లేదు.

మా రాజ్యశ్రీరభూత్పుంసః శ్రేయస్కామస్య మానద
స్వజనానుత బన్ధూన్వా న పశ్యతి యయాన్ధదృక్

ప్రపంచములో శ్రేయస్సు కావాలి అనుకునే వాడు రాజుగా ఉండకూడదు.
ఈ రాజ్య మదముతో గుడ్డివాడై, తన వారినీ బంధువులనూ చక్కగా చూడలేడు

శ్రీశుక ఉవాచ
ఏవం సౌహృదశైథిల్య చిత్త ఆనకదున్దుభిః
రురోద తత్కృతాం మైత్రీం స్మరన్నశ్రువిలోచనః

వారి ఇద్దరి మైత్రినీ కృత్యములనూ తలచుకుని కన్నీటితో విలపించాడు వసుదేవుడు.

నన్దస్తు సఖ్యుః ప్రియకృత్ప్రేమ్ణా గోవిన్దరామయోః
అద్య శ్వ ఇతి మాసాంస్త్రీన్యదుభిర్మానితోऽవసత్

ఎప్పుడు నందుడు బయలు దేరబోతూ ఉన్నా వసుదేవుడు దాన్ని వాయిదా వేయిస్తూ, అలా మూడు నెలలు ఉంచేసాడు.

తతః కామైః పూర్యమాణః సవ్రజః సహబాన్ధవః
పరార్ధ్యాభరణక్షౌమ నానానర్ఘ్యపరిచ్ఛదైః

మూడు  నెలల తరువాత వారు వారు కోరిన రీతిలో వారి వారికి కానుకలు అందించి, ఆభరణాలూ వస్త్రాలూ కానుకలుగా ఇచ్చి బంధువులతో సహా

వసుదేవోగ్రసేనాభ్యాం కృష్ణోద్ధవబలాదిభిః
దత్తమాదాయ పారిబర్హం యాపితో యదుభిర్యయౌ

వసుదేవుడూ ఉగ్రసేనుడూ బలరాముడూ కృష్ణుడూ ఇలాంటి వారు ఇచ్చినవి తీసుకుని నందుడు వ్రేపల్లెకు వెళ్ళాడు

నన్దో గోపాశ్చ గోప్యశ్చ గోవిన్దచరణామ్బుజే
మనః క్షిప్తం పునర్హర్తుమనీశా మథురాం యయుః

నందుడూ గోపాలురూ గోపికలూ పరమాత్మ యందు ఉన్న అనురాగాన్ని భక్తినీ వెనక్కు తీసుకోలేక పోలేక పోలేక వెనక్కు వెళ్ళారు

బన్ధుషు ప్రతియాతేషు వృష్ణయః కృష్ణదేవతాః
వీక్ష్య ప్రావృషమాసన్నాద్యయుర్ద్వారవతీం పునః

తరువాత వర్షాకాలం రాబోతోంది అన్న ఉద్దేశ్యముతో వారు ద్వారకా నగరానికి వెళ్ళారు

జనేభ్యః కథయాం చక్రుర్యదుదేవమహోత్సవమ్
యదాసీత్తీర్థయాత్రాయాం సుహృత్సన్దర్శనాదికమ్

ప్రభాస తీర్థములో సూర్యగ్రహణ సమయములో వసుదేవుడు ఆచరించిన అద్భుతమైన యజ్ఞ్యం గురించి అందరికీ వర్ణించి సంతోషముతో చెప్పుకున్నారు
తీఎర్థయాత్ర నెపముతో ఎంతో కాలం నుండీ చూడని బంధువులనూ మిత్రులనూ చూచారు. ఎంత తపస్సు చేసినా ప్రయత్నం చేసినా చూడలేన్ మహర్షులందరినీ ఒకే చోట చూడగలిగారు. వారే ఋత్విక్కులుగా ఉండి యజ్ఞ్యాన్ని జరిపించారు. దీన్ని గొప్ప అదృష్టముగా అందరూ చెప్పుకున్నారు.

                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts