Followers

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

            ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం


శ్రీద్ధవ ఉవాచ
విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో హీశ్వరస్య తే
అవేక్షతేऽరవిణ్డాక్ష గుణం దోషం చ కర్మణామ్

విధి నిషేధాలు నీవే కదా చేసావు. విధి నిషేధాలు చెప్పిన నీవే గుణ దోషాలు చూడవద్దని అంటున్నావు. ఈ విషయం ఇంకా స్పష్టముగా చెప్పండి
నీవు చెప్పిన వేద శాస్త్రములతోటే కర్మల యొక్క గుణదోషాలను చూస్తున్నాము కదా

వర్ణాశ్రమవికల్పం చ ప్రతిలోమానులోమజమ్
ద్రవ్యదేశవయఃకాలాన్స్వర్గం నరకమేవ చ

నీవే వర్ణాలూ ఆశ్రమాలూ ప్రతిలోమాలూ అనులోమాలూ చెప్పావు.
స్వర్గమూ నరకమూ ద్రవ్యమూ దేశమూ వయసూ అన్నీ నీవే చెపావు

గుణదోషభిదాదృష్టిమన్తరేణ వచస్తవ
నిఃశ్రేయసం కథం నౄణాం నిషేధవిధిలక్షణమ్

వీటిని గుణదోషాలు లేకుండా చూడమంటావా?
నిశ్రేయసం ఇచ్చేది కూడా నీవే చెప్పావు
ఈ పని చేయి, ఈ పని చేయకూ అని నీవే చెప్పావు.

పితృదేవమనుష్యానాం వేదశ్చక్షుస్తవేశ్వర
శ్రేయస్త్వనుపలబ్ధేऽర్థే సాధ్యసాధనయోరపి

దేవతలకూ పితృదేవతలకూ మనుష్యులకూ నీకూ కూడా వేదమే కదా కన్ను
దొరకని దాన్ని ప్రయత్నించడమే శ్రేయస్సా, దొరికిన దాన్ని వదలిపెట్టడమే శ్రేయస్సా
మన ప్రయత్నముతో ఏది లభించదో దాని కొరకు ప్రయత్నం చేసి పొందుట శ్రేయస్సా? లేక వదలిపెట్టుట శ్రేయస్సా

గుణదోషభిదాదృష్టిర్నిగమాత్తే న హి స్వతః
నిగమేనాపవాదశ్చ భిదాయా ఇతి హ భ్రమః

గుణమూ దోషమూ అన్నది మాకు మాకుగా తెలియదు. అది నీవు చెప్పినదే.  నీ వేదము వలననే మేము గుణమనీ దోషమనీ తెలుసుకుంటున్నాము. ఇపుడు ఆ రెండూ వదలిపెట్టమని చెబుతున్నావు. నీ మాటతో దాన్ని వదలాలా? వేదములో చెప్పినది విని నీవు ఇపుడు చెప్పినది వదలాలా 

శ్రీభగవానువాచ
యోగాస్త్రయో మయా ప్రోక్తా నౄణాం శ్రేయోవిధిత్సయా
జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయోऽన్యోऽస్తి కుత్రచిత్

మానవులకు శ్రేయస్సు కలిగించడానికి నేనే జ్ఞ్యాన 1. కర్మ 2. భక్తి 3. యోగాలు చెప్పాను
ఇంతకన్నా నాలుగవ ఉపాయం లేదు.


నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మసు
తేష్వనిర్విణ్ణచిత్తానాం కర్మయోగస్తు కామినామ్

విరక్తి పొందిన వారికి, అన్నీ నా యందు ఉంచే వారి కొరకు జ్ఞ్యాన యోగం
సంసారం యందు విరక్తి కలగక సాంసారక విషయములను కోరుకున్నవాడి కొరకు కర్మ యోగాన్ని చెప్పాను.

యదృచ్ఛయా మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యః పుమాన్
న నిర్విణ్ణో నాతిసక్తో భక్తియోగోऽస్య సిద్ధిదః

పూర్తి విరక్తి కలుగకా , కోరికా కలుగక ఉన్నవాడికి భక్తి యోగం. అన్నీ తెలిసిన వారికి జ్ఞ్యాన యోగం, ఏదీ తెలియని వారికి కర్మ యోగం, సగం తెలిసి తెలియక, కోరిక సగం, విరక్తి సగం ఉండి, నా కథల యందు ప్రీతి ఉన్నవాడికి భక్తి యోగం. నా కథల యందు ప్రీతి ఉండడం భక్తి లక్షణం. అది వింటూ ఉండగా విరక్తి కలుగుతుంది. తరువాత భక్తి కలుగుతుంది.

తావత్కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా
మత్కథాశ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న జాయతే

విరక్తి కలుగనంత వరకూ పనులు చేయి. నా కథలను వినడములో శ్రద్ధ కలగనంత వరకూ విరక్తి కలగనంత వరకూ కర్మలు చేస్తూ ఉండండి

స్వధర్మస్థో యజన్యజ్ఞైరనాశీఃకామ ఉద్ధవ
న యాతి స్వర్గనరకౌ యద్యన్యన్న సమాచరేత్

తన ధర్మాలలో తాను ఉండి. ఎలాంటి కోరికలూ లేకుండా యజ్ఞ్యములో నన్ను ఆరాధిస్తే
అలాంటి వారికి స్వర్గమూ రాదు, నరకమూ రాదు. ఎందుకంటే వాడుగా వాడు ఏమీ కోరక, అన్నీ చేస్తూ, అన్నీ నాకే అర్పిస్తున్నాడు కాబట్టి.

అస్మింల్లోకే వర్తమానః స్వధర్మస్థోऽనఘః శుచిః
జ్ఞానం విశుద్ధమాప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయా

ఈ లోకములో ఉండే వాడు, తన ధర్మముతో ఉండేవాడు, పాప రహితుడూ పవిత్రుడూ, విశుద్ధమైన జ్ఞ్యానాన్ని గానీ భక్తిని గానీ పొందుతాడు నా సంకల్పముతో
జ్ఞ్యానముతో తరిస్తాడా, భక్తితో తరిస్తాడా నేనే నిర్ణ్యైంచి వాడికి అది ఇస్తాను. జ్ఞ్యానం చలించవచ్చేమో గానీ భక్తి చలించదు. భగవంతుని మీద ప్రేమ కలిగిన తరువాత ఏమి జరిగినా అది పోదు.

స్వర్గిణోऽప్యేతమిచ్ఛన్తి లోకం నిరయిణస్తథా
సాధకం జ్ఞానభక్తిభ్యాముభయం తదసాధకమ్

నరకములో ఉన్నవారైనా స్వర్గములో ఉన్నవారైనా ఇదే కోరుతారు
స్వర్గ నరకాలకు జ్ఞ్యానం అవసరం లేదు. అజ్ఞ్యానం ఉంటే చాలు. మోక్షం కావాలంటేనే జ్ఞ్యానం కావాలి. నా యందు భక్తి జ్ఞ్యానాలు నేను ఇస్తేనే వస్తాయి. నా గుణాలు వినాలి అన్న బుద్ధి పుడితే చాలు.

న నరః స్వర్గతిం కాఙ్క్షేన్నారకీం వా విచక్షణః
నేమం లోకం చ కాఙ్క్షేత దేహావేశాత్ప్రమాద్యతి

అందుకే బుద్ధి ఉన్నవాడెవడైనా స్వర్గ నరకాలను కోరకూడదు
ఈ లోకాన్ని కూడ కోరకూడదు. మనను పక్కదారి పట్టించే మహాభయంకరమైనది ఈ దేహ సంబంధమే.ఈ విషయం తెలుసుకున్నవాడు సంసారం లేకుండా ఉండడానికి కుదురుతుంది

ఏతద్విద్వాన్పురా మృత్యోరభవాయ ఘటేత సః
అప్రమత్త ఇదం జ్ఞాత్వా మర్త్యమప్యర్థసిద్ధిదమ్

పొరపడకుండా ఈ విషయాన్ని తెలుసుకుని అర్థం వలన కలిగే సుఖాలన్నీ నశించేవి అని తెలుసుకోవాలి

ఛిద్యమానం యమైరేతైః కృతనీడం వనస్పతిమ్
ఖగః స్వకేతముత్సృజ్య క్షేమం యాతి హ్యలమ్పటః

ఇలాంటి అన్ని అజ్ఞ్యానాలనూ యమముతో తీసిపారేసి చక్కని ఆశ్రయమిచ్చే వనస్పతిని పక్షి ప్రమాదం ఉన్న తన స్థానాన్ని వదలిపెట్టి బాగా దృఢముగా ఉన్న వృక్షాన్ని ఆశ్రయించినట్లుగా జీవుడు సంసారాన్ని వదలి నన్ను చేరాలి

అహోరాత్రైశ్ఛిద్యమానం బుద్ధ్వాయుర్భయవేపథుః
ముక్తసఙ్గః పరం బుద్ధ్వా నిరీహ ఉపశామ్యతి

పూట పూటకూ తరిగిపోయేది జీవుని ఆయుష్యం. ఒక్కో రాత్రి పగలుకూ ఆయుష్యం తరగిపోతోంది అన్న విషయాన్ని మరచిపోవద్దు. అన్నిటి యందూ కోరిక వదలిపెట్టి పరమాత్మను తెలుసుకుని దేని యందూ ఆశ లేకుండా ఉన్న వాడు శాంతిని పొందుతాడు

నృదేహమాద్యం సులభం సుదుర్లభం
ప్లవం సుకల్పం గురుకర్ణధారమ్
మయానుకూలేన నభస్వతేరితం
పుమాన్భవాబ్ధిం న తరేత్స ఆత్మహా

ఎంతో కష్టపడితేనే కానీ ఈ మానవ దేహం లభించదు. అది సంసారం అనే మహా సముద్రాన్ని దాటించేందుకు పడవ. గురువు అనే చుక్కానితో దాటాలి.
ఇవన్నీ ఉన్నా అనుకూలమైన వాయువు ఉండాలి. నేనే ఆ అనుకూలమైన వాయువుగా ఉండి నడిపిస్తాను. ఇన్ని ఉన్నావాడు సంసారాన్ని దాటకుంటే వాడు ఆత్మ ఘాతకుడు.

యదారమ్భేషు నిర్విణ్ణో విరక్తః సంయతేన్ద్రియః
అభ్యాసేనాత్మనో యోగీ ధారయేదచలం మనః

పనులు చేయుట యందు విరక్తి పొంది ఇంద్రియ నిగ్రహం కలిగి అభ్యాసముతో చంచలమైన మనసును గెలిచి నిశ్చయముగా ఉంచగలగాలి.
ఎంత జాగ్రత్తగా మనసును నిలపాలి అనుకుంటున్నామో అది అంత వేగముగా పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటుంది

ధార్యమాణం మనో యర్హి భ్రామ్యదశ్వనవస్థితమ్
అతన్ద్రితోऽనురోధేన మార్గేణాత్మవశం నయేత్

ఏమరపాటు లేకుండా అజాగ్రత్త లేకుండా దాని వెంట ఉండి మన వశం చేసుకోవాలి.

మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేన్ద్రియః
సత్త్వసమ్పన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్

ప్రాణాయామమూ ఇంద్రియ జయమూ కలిగించుకుని మనో గమనాన్ని చక్కని దారిలో పెట్టాలి. సాత్వికమైన బుద్ధితో ఈ మనసుని ఆత్మకు వశములో ఉంచాలి.

ఏష వై పరమో యోగో మనసః సఙ్గ్రహః స్మృతః
హృదయజ్ఞత్వమన్విచ్ఛన్దమ్యస్యేవార్వతో ముహుః

ఇదే మనసు యొక్క పరమ యోగము. నీకు సంగ్రహముగా చెప్పాను.

హృదయ స్వరూపాన్ని కోరుతూ మాటి మాటికీ పరిగెత్తుతున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎలా మన వశములో ఉంటుందో మనసును కూడా గట్టిగా పట్టుకోవాలి.

సాఙ్ఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః
భవాప్యయావనుధ్యాయేన్మనో యావత్ప్రసీదతి

అన్ని భావాలా సాంఖ్య వృత్తితో, ప్రతిలోమ అనులోమములతో జన్మ మరణాలను ధ్యానం చేస్తూ ఎంత వరకూ మనసు ప్రసన్నమవుతుందో అప్పుడు

నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్యోక్తవేదినః
మనస్త్యజతి దౌరాత్మ్యం చిన్తితస్యానుచిన్తయా

ఆశ లేని వాడూ వైరాగ్యాన్ని పొందినవాడు, చెప్పినదాన్ని తెలుసుగోగల పురుషునికి, ఇవన్నీ చేస్తే మనసు తన చెడు అలవాట్లనూ చెడ్డతనాన్ని విడిచిపెడుతుంది
అనుకున్నదాన్నీ ఆలోచిస్తున్నదాన్ని ధ్యానం చేస్తున్నదాన్ని , అలాగే ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే గానీ మనసు తన గుణాన్ని విడువదు.

యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా
మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః

యమాది యోగమార్గాలతో వేదాంత విద్యతో అర్చా విగ్రహాన్ని ఆరాధించడముతో గానీ తప్ప మనసును నిగ్రహించడానికి వేరే మార్గాలు లేవు

యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్
యోగేనైవ దహేదంహో నాన్యత్తత్ర కదాచన

ఒకసారి నాయందు మనసు ఉంచిన యోగి పొరబాటున నిందించదగిన పని చేస్తే మళ్ళీ ఆ దోషాన్ని యోగముతోనే కాల్చిపారేయాలి. దాన్ని తొలగించడానికి ఇంకో కర్మ ఏదీ ఉండదు

స్వే స్వేऽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః
కర్మణాం జాత్యశుద్ధానామనేన నియమః కృతః
గుణదోషవిధానేన సఙ్గానాం త్యాజనేచ్ఛయా

తమ తమ అధికారములో తొలగకుండా ఉండడం గుణము
సహజముగా అనుసరించవలసిన కర్మలకు ఇదే నివారణామార్గము
గుణములు చెప్పడానికి కారణం - దాని యందు నీ మనసుకు గల ఆసక్తిని తగ్గించడానికి
భగవత్ తత్వాన్ని ఆచరించడానికి, సాంసారిక తత్వమును వదలిపెట్టడానికి, గుణాన్నీ దోషాన్ని చెప్పాను. జ్ఞ్యానం కలిగి విరక్తి చెందిన వారికి గుణమూ దోషమూ  ఉండవు. భగవంతుని యందు మనసు లగ్నం అయ్యేవరకూ ఈ సంసారం యందు ఉండే వస్తువులు గుణ దోష చర్చ. మనసు సంసారం మీద లేనప్పుడు, అన్ని విడిచి పరమాత్మ యందే మనసు ఉంచినవాడికి గుణములూ అగుణములూ రెండూ ఉండవు.
అధర్మ అసత్వ భావనతో మరిగిపోతున్న జీవులకు దాని నుండి బయటపడడానికి గుణములూ దోషాలూ చెప్పాను. దోషం చెప్పింది విడుచుటకు, గుణములు చెప్పింది చేరుటకు. ఆ రెండూ దాటిన వారికి ఆ రెండూ ఉండవు.

జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణః సర్వకర్మసు
వేద దుఃఖాత్మకాన్కామాన్పరిత్యాగేऽప్యనీశ్వరః

నా కథలో శ్రద్ధ కలిగి అన్ని కర్మలనూ మానివేస్తే
అలాంటి వారు దుఃఖాత్మకమైన కామనలను విడిచిపెట్టగలరు. నన్ను ఏమాత్రం స్మరించని వారు దుఃఖాత్మకమైన కోరికలను విడిచిపెట్టలేరు. నన్ను స్మరించేవారి వద్దకు అవి రావు.

తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుర్దృఢనిశ్చయః
జుషమాణశ్చ తాన్కామాన్దుఃఖోదర్కాంశ్చ గర్హయన్

అలా తెలుసుకుని ప్రీతితో నన్ను సేవించు, శ్రద్ధ కలవాడై దృఢ నిశ్చయం కలవాడై
దుఃఖములను కలిగించే ఆయా కామములను సేవిస్తూ ఉన్నా వాటిని నిందిస్తూ ఉంటాడు.

ప్రోక్తేన భక్తియోగేన భజతో మాసకృన్మునేః
కామా హృదయ్యా నశ్యన్తి సర్వే మయి హృది స్థితే

భక్తి యోగముతో నన్ను మాటి మాటికీ భజించేవాడికి హృదయములో ఉన్న అన్ని కోరికలూ నశిస్తాయి ఎందుకంటే అక్కడ నేనే ఉంటాను

భిద్యతే హృదయగ్రన్థిశ్ఛిద్యన్తే సర్వసంశయాః
క్షీయన్తే చాస్య కర్మాణి మయి దృష్టేऽఖిలాత్మని

అఖిల ఆత్మ స్వరూపుడైన నన్ను చూచాక హృదయ గ్రంధి పోయి సంశయాలు పోయి కర్మలన్నీ క్షయమును పొందుతాయి.

తస్మాన్మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః
న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేదిహ

నా భక్తి కలిగి నా స్వరూపాన్ని ధ్యానించేవారికి అలాంటి  వారికి జ్ఞ్యానముతో వైరాగ్యముతో పని లేదు. జ్ఞ్యాన వైరాగ్యములూ శ్రేయస్సూ, అన్నీ నాయందు మనసు లగ్నం కానంత వరకే. మనసు నాయందు లగ్నమయ్యాక వాటితో పనే లేదు.

యత్కర్మభిర్యత్తపసా జ్ఞానవైరాగ్యతశ్చ యత్
యోగేన దానధర్మేణ శ్రేయోభిరితరైరపి

కర్మలతో తపస్సుతో జ్ఞ్యానవైరాగ్యములతో యోగముతో దానముతో ధర్మములతో ఇతర శ్రేయస్సులతో ఏవేవి లభిస్తాయో అవి అన్నీ నా భక్తియోగముతో నా భక్తుడు సులభముగా పొందుతాడు.

సర్వం మద్భక్తియోగేన మద్భక్తో లభతేऽఞ్జసా
స్వర్గాపవర్గం మద్ధామ కథఞ్చిద్యది వాఞ్ఛతి

స్వర్గాన్ని కానీ అపవర్గాన్ని కానీ నా నివాసాన్ని గానీ సాధువులూ ఏకాంత భక్తులూ కోరరు.

న కిఞ్చిత్సాధవో ధీరా భక్తా హ్యేకాన్తినో మమ
వాఞ్ఛన్త్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్

నేను స్వయముగా ఇస్తానని అన్నా మోక్షాన్నీ కైవల్యాన్నీ కోరరు
అన్నిటికంటే ఉత్తమ నిశ్రేయసం దేన్నీ కోరక ఉండుటే.

నైరపేక్ష్యం పరం ప్రాహుర్నిఃశ్రేయసమనల్పకమ్
తస్మాన్నిరాశిషో భక్తిర్నిరపేక్షస్య మే భవేత్

దేన్నీ ఆశించకుండా ఉండేవారికే నా యందు భక్తి ఉంటుంది

న మయ్యేకాన్తభక్తానాం గుణదోషోద్భవా గుణాః
సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరముపేయుషామ్

నా యందు మాత్రమే భక్తి ఉన్నవారికి గుణములతో దోషములతో పని లేదు.
బుద్ధి యొక్క పారమ్యాన్ని పొందిన వారికి గుణములూ దోషములూ ఉండవు

ఏవమేతాన్మయా దిష్టాననుతిష్ఠన్తి మే పథః
క్షేమం విన్దన్తి మత్స్థానం యద్బ్రహ్మ పరమం విదుః

ఇలా నేను చెప్పిన ఈ మార్గాన్ని ఎవరు ఆచరిస్తారో వారు ఏది పరబ్రహ్మగా చెప్పుకుంటారో , ఏది పరమ ధామం అని చెప్పుకుంటారో ఏది వైకుంఠం అని అంటారో దాన్ని పొందుతారు


                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts