ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ప్రధమోధ్యాయం
దశమ స్కంధ సారం
దశమ స్కంధ చివరి శ్లోకములో సారమంతా ఉంది.
కృష్ణ పరమాత్మ అవతరించి తన పాద తీర్థాన్ని పవిత్ర తీర్థముగా చేసాడు. మిత్రువులకు శత్రువులకూ కూడా తన స్వరూపాన్ని చూపి పరమ పదాన్ని అందించాడు. పవిత్రమైన తన నామాన్ని విన్న, పలికిన వారి వంశాలు ఉద్ధరించాడు. భూమి యొక్క సంస్త భారాన్ని తొలగించాడు.
ఇలాంటి కృష్ణ పరమాత్మ పాదాలను నిరంతరం స్మరించండి, ధ్యానం చేయండి. ఆయన ఆచరించిన అన్ని కర్మలనూ స్మరించండు. ధర్మార్థకామాలు ఏమిటి, వాటిని ఎలా కామరహితముగా పరమాత్మార్పితముగా ఎలా సేవించాలో తన ఆచరణతో కృష్ణుడు మనకు చూపాడు.ఆయనను చేరాలనుకునే వారు ఆయన పాదాలను స్మరిస్తూ ఉండాలి.
శ్రీశుక ఉవాచ
కృత్వా దైత్యవధం కృష్ణః సరామో యదుభిర్వృతః
భువోऽవతారయద్భారం జవిష్ఠం జనయన్కలిమ్
ఇలా కృష్ణ పరమాత్మ బలరామునితో యాదవులతో కలసి వారిలో వారికి కలహాన్ని కలిగించి దైత్యులందరినీ వధించి భూభారాన్ని తొలగించాడు. దైత్యులలో కలహాన్ని కలిగించడము ద్వారా భూభారాన్ని తొలగించాడు.
యే కోపితాః సుబహు పాణ్డుసుతాః సపత్నైర్
దుర్ద్యూతహేలనకచగ్రహణాదిభిస్తాన్
కృత్వా నిమిత్తమితరేతరతః సమేతాన్
హత్వా నృపాన్నిరహరత్క్షితిభారమీశః
కౌరవులు మాయా జ్యూతం అవమానం జుట్టుపట్టుకుని లాగుట, వంటి దుష్ట చేష్టలతో పాండవులు కోపింపచేయబడి, వారికి వీరినీ వీరికి వారినీ కారణముగా చూపించి వారిని చంపి పరమాత్మ భూభారాన్ని తొలగించాడు.
భూభారరాజపృతనా యదుభిర్నిరస్య
గుప్తైః స్వబాహుభిరచిన్తయదప్రమేయః
మన్యేऽవనేర్నను గతోऽప్యగతం హి భారం
యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే
యాదవులంతా కృష్ణుని బాహువులచే కాపాడబడ్డారు
యాదవుల వలన భూభారం అంతకు రెట్టింపైనట్లు అయ్యింది. తాను రక్షణగా ఉండగా యాదవులను ఎవరూ కన్నెత్తి చూడలేరు.
ఎవరి చేతా సహించరాని యాదవ కులం ఉంది. తానవతరించిన పని ఇంకా నెరవేరనట్లే లెక్క.
నైవాన్యతః పరిభవోऽస్య భవేత్కథఞ్చిన్
మత్సంశ్రయస్య విభవోన్నహనస్య నిత్యమ్
అన్తః కలిం యదుకులస్య విధాయ వేణు
స్తమ్బస్య వహ్నిమివ శాన్తిముపైమి ధామ
నేను రక్షగా ఉండగా ఇతరుల వలన వీరికి ఆపదరాదు. యదుకులములో వారిలో వారికే కలహం సృష్టించాలి. వెదురు బొంగులో పుట్టిన అగ్ని మొత్తం వెదురు చెట్లనూ వనాలనూ కాల్చివేస్తుంది. అలాగే యదు వంశములో కూడా వారిలో వారికే కలహం సృష్టించాలి.
అపుడు నేను శాంతి పొంది నాలోకానికి నేను వెళతాను. సత్య సంకల్పుడైన స్వామి బ్రాహ్మణ శాపం అనే మిషతో తన కులాన్ని తానే నిర్మూలింపచేసాడు
ఏవం వ్యవసితో రాజన్సత్యసఙ్కల్ప ఈశ్వరః
శాపవ్యాజేన విప్రాణాం సఞ్జహ్రే స్వకులం విభుః
స్వమూర్త్యా లోకలావణ్య నిర్ముక్త్యా లోచనం నృణామ్
గీర్భిస్తాః స్మరతాం చిత్తం పదైస్తానీక్షతాం క్రియాః
ప్రపంచములో సౌందర్యానికి నిదర్శనమైన తన స్వరూపాన్ని మానవుల కనులకు ఆనంద మూర్తిగా భావించబడే తన స్వరూపాన్ని గొంతులతో కీర్తించేవారికీ కన్నులతో చూచేవారికీ, కేవలం కీర్తిని మాత్రమే మిగిలిచి భూమి మీద తన లీలలను స్థిరపరచి, నేను ఏర్పరచిన లీలలనూ కథలనూ కీర్తినీ తెలుసుకొన్న స్మరించుకున్న భూలోకవాసులు అజ్ఞ్యానాన్ని తరించి నా దగ్గరకు చేరతారు అని నిర్ణయించాడు పరమాత్మ
ఆచ్ఛిద్య కీర్తిం సుశ్లోకాం వితత్య హ్యఞ్జసా ను కౌ
తమోऽనయా తరిష్యన్తీత్యగాత్స్వం పదమీశ్వరః
శ్రీరాజోవాచ
బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినామ్
విప్రశాపః కథమభూద్వృష్ణీనాం కృష్ణచేతసామ్
యన్నిమిత్తః స వై శాపో యాదృశో ద్విజసత్తమ
కథమేకాత్మనాం భేద ఏతత్సర్వం వదస్వ మే
పరమ బ్రాహ్మణ భక్తులూ దానములో నిపుణులూ వృద్ధులను సేవించేవారు, కృష్ణుని యందే మనసు ఉంచేవారికి బ్రాహ్మణ శాపం ఎలా వచ్చింది
అంత ఐకమత్యముతో ఉండే యాదవులలో పరస్పరం కలహం ఎందుకు కలిగింది.
శ్రీబాదరాయణిరువాచ
బిభ్రద్వపుః సకలసున్దరసన్నివేశం
కర్మాచరన్భువి సుమఙ్గలమాప్తకామః
ఆస్థాయ ధామ రమమాణ ఉదారకీఋతిః
సంహర్తుమైచ్ఛత కులం స్థితకృత్యశేషః
ప్రపంచములో అన్ని అందాలకూ ముద్ద ఐన శరీరాన్ని ధరించి, అన్ని కోరికలనూ పొంది, ఏ కోరికా లేక పరమ పవిత్రమైన కర్మలను ఆచరిస్తూ, ఉదారుడై, మిగిలిన ఆ ఒక్క పనీ పూర్తి చేయదలచి, యదుకులాన్ని క్షయం చేయదలచుకున్నాడు
కర్మాని పుణ్యనివహాని సుమఙ్గలాని
గాయజ్జగత్కలిమలాపహరాణి కృత్వా
కాలాత్మనా నివసతా యదుదేవగేహే
పిణ్డారకం సమగమన్మునయో నిసృష్టాః
పుణ్యాల మూటా, పరమ శుభకరములూ, కలి పాపాలను తొలగించేవి పరమాత్మ కర్మలు
కాలస్వరూపముతో వసుదేవుని ఇంట్లో ఉంటూ ఉండగా మునులందరూ ఉండే పిండాలక క్షేత్రానికి వెళ్ళారు
విశ్వామిత్రోऽసితః కణ్వో
దుర్వాసా భృగురఙ్గిరాః
కశ్యపో వామదేవోऽత్రిర్
వసిష్ఠో నారదాదయః
వీరంతా అక్కడ ఉన్నారు
క్రీడన్తస్తానుపవ్రజ్య కుమారా యదునన్దనాః
ఉపసఙ్గృహ్య పప్రచ్ఛురవినీతా వినీతవత్
వారిని చూడగా యాదవుల మనసులో వారిని అపహాస్యం చేయాలి అన్న భావన కలిగింది
తే వేషయిత్వా స్త్రీవేషైః సామ్బం జామ్బవతీసుతమ్
ఏషా పృచ్ఛతి వో విప్రా అన్తర్వత్న్యసితేక్షణా
జాంబవతికి పుట్టిన సాంబుడిని ఒక గర్భవతి వేషం వేసి, 'ఈమె అడుగుదామంటే సిగ్గు పడుతోంది, మీరు చెప్పండి, ఈమును పుత్రున్ని ప్రసవిస్తుందా, పుత్రికను ప్రసరిస్తుందా అని అడిగితే
ప్రష్టుం విలజ్జతీ సాక్షాత్ప్రబ్రూతామోఘదర్శనాః
ప్రసోష్యన్తీ పుత్రకామా కిం స్విత్సఞ్జనయిష్యతి
మునులు కోపించి, "మీ కులాన్ని నాశనం చేసే ముసలాన్ని ప్రసవిస్తుంది " అని చెప్పారు
ఏవం ప్రలబ్ధా మునయస్తానూచుః కుపితా నృప
జనయిష్యతి వో మన్దా ముషలం కులనాశనమ్
వెంటనే వారు భయపడి ఆ గర్భాకారాన్ని తీసి పారేసారు
తచ్ఛ్రుత్వా తేऽతిసన్త్రస్తా విముచ్య సహసోదరమ్
సామ్బస్య దదృశుస్తస్మిన్ముషలం ఖల్వయస్మయమ్
కిం కృతం మన్దభాగ్యైర్నః కిం వదిష్యన్తి నో జనాః
ఇతి విహ్వలితా గేహానాదాయ ముషలం యయుః
అంతలోనే ముసలం పుట్టింది. దురదృష్టవంతులం, ఎంత పని చేసాం., లోకం ఏమంటుంది మనల్ని చూసి.
అని భయపడి ఆ ముసలానీ తీసుకుని
తచ్చోపనీయ సదసి పరిమ్లానముఖశ్రియః
రాజ్ఞ ఆవేదయాం చక్రుః సర్వయాదవసన్నిధౌ
వాడిన ముఖాలతో అందరిముందూ రాజుతో ఆ విషయాన్ని విన్నవించారు
శ్రుత్వామోఘం విప్రశాపం దృష్ట్వా చ ముషలం నృప
విస్మితా భయసన్త్రస్తా బభూవుర్ద్వారకౌకసః
అమోఘమైన బ్రాహ్మణ శాపాన్ని చూచి ద్వారకా వాసులంతా ఆశ్చర్యాన్నీ భయాన్ని చెందారు
తచ్చూర్ణయిత్వా ముషలం యదురాజః స ఆహుకః
సముద్రసలిలే ప్రాస్యల్లోహం చాస్యావశేషితమ్
ఆహుకుడనే యదురాజు దాన్ని విరిచివేసి సముద్రములో పడేసారు. ఆ లోహము యొక్క పొడిని ఒక చేప మింగేసింది
కశ్చిన్మత్స్యోऽగ్రసీల్లోహం చూర్ణాని తరలైస్తతః
ఉహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసన్కిలైరకాః
అది మింగగా మిగిలిన పొడి, సముద్రములోంచి కొట్టుకుని ఒడ్డుకు వచ్చి మొక్కలుగా పెరిగాయి.
మత్స్యో గృహీతో మత్స్యఘ్నైర్జాలేనాన్యైః సహార్ణవే
తస్యోదరగతం లోహం స శల్యే లుబ్ధకోऽకరోత్
ఇనుప ముక్కను మింగిన చేపను బెస్తవాళ్ళు పట్టి, దాన్ని కోస్తే ఒక ఇంపుత ముక్క కనపడగా, దాన్ని ఒక వేటగాడు వేట కోసం దాన్ని బాణముగా తీసుకున్నాడు
భగవాన్జ్ఞాతసర్వార్థ ఈశ్వరోऽపి తదన్యథా
కర్తుం నైచ్ఛద్విప్రశాపం కాలరూప్యన్వమోదత
ఈ విషయం తెలిసిన పరమాత్మ సమర్ధుడైనా సరే బ్రాహ్మణ శాపాన్ని, కాల రూపి ఐన స్వామి మార్చలేదు. దాన్ని ఆమోదించాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు