Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీబ్రాహ్మణ ఉవాచ
పరిగ్రహో హి దుఃఖాయ యద్యత్ప్రియతమం నృణామ్
అనన్తం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకిఞ్చనః

మనకు బాగా నచ్చినదీ ఇష్టమైనదీ అని చెప్పుకుని అది మన దగ్గరలేకుంటే ఎదుటివారి నుండి తీసుకుంటాము. ప్రపంచములో ఇంతకు మించిన దుఃఖం ఇంకొకటి లేదు.
ఏమీ లేనివాడు, దేనినీ కోరని వాడు పొందిన సుఖాన్ని ప్రతీ దాన్ని కోరి , ప్రతీ దాన్నీ కోరేవాడు, ఇతరుల నుండి పొందేవాడు పొందలేడు.

సామిషం కురరం జఘ్నుర్బలినోऽన్యే నిరామిషాః
తదామిషం పరిత్యజ్య స సుఖం సమవిన్దత

ఒక పక్షి ఎక్కడినుంచో చిన్న మాంస ఖండాన్ని తీసుకు వచ్చి తిందామని కూర్చోగానే అది చూసిన మిగతా పక్షులు చూచి దాని వెనక పరిగెత్తుకుని వచ్చి ఆ మాంసం కోసం బాధించసాగాయి. అది చూసి ఆ పక్షి పారిపోసాగింది. అది పారిపోయినా మిగతా పక్షులన్నీ వెంటబడ్డాయి. పొడిచి పొడిచి బాధించసాగాయి. దొరకకుండా ఏకాంతములోకి వెళ్ళి తినాలని ఈ పక్షి పరుగెత్తుతున్న కొద్దీ అవి వెంబడిస్తూ పొడుస్తూ ఉన్నాయి. చివరకు బాధ తట్టుకోలేక ఆ మాంస ఖండాన్ని వదిలేసింది. అపుడు పక్షులన్నీ ఆ మాంస ఖండం వెనుక వెళ్ళాయి, ఈ పక్షిని వదిలేసాయి. మనం కూడా ధనాన్ని పట్టుకుంటే అది మన నుంచి తీసుకునే దాక వారు మనని వెంబడిస్తూ ఉంటారు. పరిగ్రహమే దుఃఖాన్ని కలిగిస్తుంది అని కురల పక్షి మనకు చెప్పింది.

న మే మానాపమానౌ స్తో న చిన్తా గేహపుత్రిణామ్
ఆత్మక్రీడ ఆత్మరతిర్విచరామీహ బాలవత్

నాకు మానమూ అవమానము చింతా లేదు. ఇల్లు ఉంటే బాధ. భార్య ఇల్లూ సంతానమూ ఏమీ లేవు నాకు. అందుకు మానమూ అవమానము లేదు. పరమాత్మ యందే కోరిక కలిగి పరమాత్మ యందే ఆనందిస్తున్నాను. చిన్న పిల్లవానిలా తిరుగుతున్నాను.

ద్వావేవ చిన్తయా ముక్తౌ పరమానన్ద ఆప్లుతౌ
యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరం గతః

ప్రపంచములో ఏ చింతా లేకుండా పరమానందాన్ని పొందగలవారు ఇద్దరే. ఏమాత్రమూ జ్ఞ్యానం లేని బాలురూ పరిపూర్ణ జ్ఞ్యానం పొంది ప్రకృతిని దాటినవారు.

క్వచిత్కుమారీ త్వాత్మానం వృణానాన్గృహమాగతాన్
స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బన్ధుషు

ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది, యుక్త వయసుకు వచ్చింది, పెళ్ళి కుదిరింది. ఇంట్లో వారు బయటకు వెళ్ళిన సమయములో పెళ్ళి వారు ఇంటికి వచ్చారు. వారికి వండి పెట్టడానికి ఇంట్లో బియ్యం లేదు. ఆమెకు ధాన్యం కనపడింది. దాన్ని దంచాలి.

తేషామభ్యవహారార్థం శాలీన్రహసి పార్థివ
అవఘ్నన్త్యాః ప్రకోష్ఠస్థాశ్చక్రుః శఙ్ఖాః స్వనం మహత్

ఆమె వారితో వంట చేస్తా అని చెప్పి పెరట్లోకి వెళ్ళి రోటి దగ్గరకు వెళ్ళి ధాన్యం అందులో వేసి దంచుతోంది. చేతికి కంకణాలు ఉండడం వలన దంచుతుంటే ఘల్లు ఘల్లు అని చప్పుడు వస్తోంది.

సా తజ్జుగుప్సితం మత్వా మహతీ వృడితా తతః
బభఞ్జైకైకశః శఙ్ఖాన్ద్వౌ ద్వౌ పాణ్యోరశేషయత్

ఆ చప్పుడు వారు వింటే బాగోదని చెప్పి రెండు గాజులు తీసి పక్కన బెట్టింది. ఐనా చప్పుడు వచ్చింది, అలా ఇంకో రెండు తీసింది, ఐనా చప్పుడు వచ్చింది. అలా అన్ని గాజులూ తీసి చెరో చేతికి చెరో గాజూ ఉండేట్లు చూసుకుంది. అపుడు దంచేప్పుడు చప్పుడు రాలేదు. మనకు కూడ సంగముంటేనే గొడవంతా, ఏకాంతముగా ఉంటే ఏ బాధా ఉండదు.

ఉభయోరప్యభూద్ఘోషో హ్యవఘ్నన్త్యాః స్వశఙ్ఖయోః
తత్రాప్యేకం నిరభిదదేకస్మాన్నాభవద్ధ్వనిః

అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరిన్దమ
లోకాననుచరన్నేతాన్లోకతత్త్వవివిత్సయా

వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి
ఏక ఏవ వసేత్తస్మాత్కుమార్యా ఇవ కఙ్కణః

పది మందితో ఉంటే కలహం, ఇద్దరితో ఉంటే ముచ్చట్లు వస్తాయి, ఒక్కడూ ఉంటే ఏమీ కాదు. కన్య చేతికి కంకణం లాగా ఒక్కడూ సంచరించాలి. ఇద్దరూ కలిస్తే మౌనం ఉండదు.

మన ఏకత్ర సంయుఞ్జ్యాజ్జితశ్వాసో జితాసనః
వైరాగ్యాభ్యాసయోగేన ధ్రియమాణమతన్ద్రితః

ప్రాణాయామముతో ఆసన విజయముతో మనసును ఒక చోట ఉంచాలి. వైరాగ్యముతో అభ్యాసముతో మనసును ఏమరపాటు లేకుండా పరమాత్మ యందు ఒంటిగా ఉండి లగ్నం చేయాలి. ఇద్దరు కలసి తపస్సు చేయలేరు.

యస్మిన్మనో లబ్ధపదం యదేతచ్ఛనైః శనైర్ముఞ్చతి కర్మరేణూన్
సత్త్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణముపైత్యనిన్ధనమ్

పరమాత్మయందు మనసు లగ్నం చేస్తే మెల్ల మెల్లగా కర్మ బంధాలను విడిచిపెడతాము. సత్వాన్ని బాగా పెంచి రజస్తమాలను నశింపచేయాలి.తక్కిన గుణాలేవీ లేకపోవడముతో సత్వ గుణము కూడా చల్లారుతుంది. కట్టెలు లేని అగ్ని తనకు తాను చల్లరినట్లుగా. ఇలా ఆత్మ యందు మనసును ఉంచి వెలుపల ఏముంది లోపల ఏముంది అన్న విషయాన్ని తెలుసుకోకూడదు.

తదైవమాత్మన్యవరుద్ధచిత్తో న వేద కిఞ్చిద్బహిరన్తరం వా
యథేషుకారో నృపతిం వ్రజన్తమిషౌ గతాత్మా న దదర్శ పార్శ్వే

ఏకచార్యనికేతః స్యాదప్రమత్తో గుహాశయః
అలక్ష్యమాణ ఆచారైర్మునిరేకోऽల్పభాషణః

దానికి ఉదాహరణగా ఒక బాణం చేసేవాడు ఉన్నాడు. బాణాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. పక్కనే రాజు గారు వెళుతున్నారు. అందరూ లేచారు గానీ బాణం చేసేవాడు మాత్రంలేవలేదు. మనసు ఏకాగ్రముగా ఉంటే మన చుట్టు పక్కల ఏమున్నా మనం వాటిని చూడం. వాటికి వశం కాము. అది లేని నాడు అన్నిటినీ చూస్తాము, వశం అవుతాము. పక్క నుంచి వెళుతున్నారాజును కూడా ఏకాగ్ర మనస్కుడైన బాణం యందు మనస్సు ఉన్నవాడు చూడలేదు. ఒకే గురువును మనసులో పెట్టుకుని ప్రమాదం లేకుండా అరణ్యములో కానీ ఏకాంతములో గానీ మౌనం వహించి, లేదా వీలైనంత తక్కువ మాట్లాడుతూ, సంసారమూ ఇల్లూ అనే వ్యాపకం లేకుండా ఉండాలి.

గృహారమ్భో హి దుఃఖాయ విఫలశ్చాధ్రువాత్మనః
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే

మనో నిశ్చయం లేని వాడికి ప్రతీ ప్రయత్నం వ్యర్థమవుతుంది. తనకు తాను ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయడం వ్యర్థం. ఒకరు కట్టిన ఇంటిలో వెళ్ళి ఉండడం శ్రేష్టం. పాము చీమలు పెట్టిన పుట్టలో ఉంటుంది. తనకు తానుగా ఇల్లు కట్టుకోదు. భగవంతుడు ఇచ్చిన దానితోనే తృప్తి పొందు. నేనుగా ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే దుఃఖం కలుగుతుంది.

ఏకో నారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా
సంహృత్య కాలకలయా కల్పాన్త ఇదమీశ్వరః
ఏక ఏవాద్వితీయోऽభూదాత్మాధారోऽఖిలాశ్రయః

పరమాత్మ ఒక్కడే తాను సృష్టించిన జగత్తును తానే ప్రళయ కాలములో సంహరిస్తాడు. అలాంటి పరమాత్మ ఒక్కడే. రెండవ వాడు లేడు. ఆయన అన్నిటికీ ఆధారమూ ఆశ్రయం.

కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు
సత్త్వాదిష్వాదిపురుషః ప్రధానపురుషేశ్వరః

తన ప్రహ్బావం ఐన కాలముతో అన్ని శక్తులూ భూతములూ ఏకాత్మ్యాన్ని పొందినపుడు, సత్వాదులన్నీ సమానముగా ఐనపుడు ప్రధానపురుషుడైన పరమాత్మ, పరములకూ అపరములకూ పరమైన ఆయన పరుడు.

పరావరాణాం పరమ ఆస్తే కైవల్యసంజ్ఞితః
కేవలానుభవానన్ద సన్దోహో నిరుపాధికః

ఆయనొక్కడే ఉంటాడు. అనుభవానంద స్వరూపుడు. ఇంకో ఉపాధి ఉండదు. మనమానందం పొందాలి అంటే కావలసిన దాన్ని ఇంద్రియానికి అందిస్తేనే ఆనందం. కానీ పరమాత్మకు అలా కాదు. ఇంద్రియాలూ మనసూ బుద్ధీ లేదు. తక్కిన దానితో సంబంధం కలిగితే వచ్చే ఆనందం నిత్యం కాదు. కానీ పార్మాత్మ అలా కాదు. కేవలానంద స్వరూపుడు.

కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికామ్
సఙ్క్షోభయన్సృజత్యాదౌ తయా సూత్రమరిన్దమ

తన ఆత్మానుభావముతో త్రిగుణాత్మకమైన ప్రకృతిని క్షోభింపచేస్తూ సృష్టిస్తాడు.ఆయనే బ్రహ్మ

తామాహుస్త్రిగుణవ్యక్తిం సృజన్తీం విశ్వతోముఖమ్
యస్మిన్ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్

దాన్నే ప్రకృతీ అంటారు. అది మూడు గుణాలతో కలసి ఉంటుంది. అది విశ్వతోముఖం. సకల ప్రపంచం దానితోనే కూర్చబడి ఉంటుంది.అలాంటి ప్రకృతితోనే పురుషుడు సంసారములో సంచరిస్తాడు

యథోర్ణనాభిర్హృదయాదూర్ణాం సన్తత్య వక్త్రతః
తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః

సాలెపురుగు తన నోటినుంచి దారాన్ని తీసి చుట్టూ గూడు కడుతుంది. చూసేవారికి ఆ సాలెపురుగు చస్తుందేమో అనిపిస్తుంది. కానీ సాలెపురుగు తాను సృష్టించిన దారాన్ని తన నోటితో తానే తిని బయటకు వస్తుంది. పరమాత్మ కూడా ప్రపంచాన్ని తానే సృష్టించి తానే మింగివేస్తాడు

యత్ర యత్ర మనో దేహీ ధారయేత్సకలం ధియా
స్నేహాద్ద్వేషాద్భయాద్వాపి యాతి తత్తత్స్వరూపతామ్

దేహి తన మనసును ఎక్కడ లగ్నం చేస్తాడో, స్నేహముతో గానీ భయముతో గానీ ద్వేషముతో గానీ మనసు ఎక్కడెక్కడ లగ్నం చేస్తాడో అలాంటి జన్మే పొందుతాడు.

కీటః పేశస్కృతం ధ్యాయన్కుడ్యాం తేన ప్రవేశితః
యాతి తత్సాత్మతాం రాజన్పూర్వరూపమసన్త్యజన్

తుమ్మెద ఒక పురుగును తీసుకుని గోడకు గల రంధ్రములో పడేసి ఆ పురుగును బయటకు రానీయకుండా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తుమ్మెదనే చూస్తూ చూస్తూ కొన్నాళ్ళకు ఆ పురుగు కూడా ఆ తుమ్మెదగా మారిపోతుంది. మనం దేన్ని నిరంతరం ధ్యానం చేస్తామో మనకు ఆ రూపమే లభిస్తుంది. భయముతో కావొచ్చు స్నేహముతో కావొచ్చు ద్వేషముతో కావొచ్చు. జన్మాంతరం సంసారం బాధలూ అన్నీ కలిగేవి ధ్యానముతోనే. ప్రకృతిని ధ్యానిస్తే సంసారం. పరమాత్మను ధ్యానిస్తే మోక్షం వస్తుంది.

ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః
స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో

ఈ విధముగా నేను ఇరవై నాలుగు గురువులతో ఇలాంటి బుద్ధి బోధించబడింది.
నేను జాగ్రత్తగా వీటితోటీ నా శరీరముతోటీ నేర్చుకున్న విద్యను చెబుతాను విను

దేహో గురుర్మమ విరక్తివివేకహేతుర్
బిభ్రత్స్మ సత్త్వనిధనం సతతార్త్యుదర్కమ్
తత్త్వాన్యనేన విమృశామి యథా తథాపి
పారక్యమిత్యవసితో విచరామ్యసఙ్గః

 నా శరీరాన్ని జాగ్రత్తగా చూస్తే ఈ శరీరమే నాకు విరక్తిని కలిగిస్తుంది.
సత్వాన్ని పోగొట్టుకుని రజస్తమస్సులతో ప్రవర్స్తిస్తే నిరంతరం దుఃఖం భయం శోకం మోహం కలుగుతుంది.   రజస్తమస్సులు వదిలి సత్వాన్ని తీసుకుంటే ఆనందమే వస్తుంది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దీనితో ఆయా వచ్చే తత్వములను బాగా విమర్శిస్తున్నాను. ఇలా ఆలోచించి చూస్తే నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఈ శరీరం నాది కాదు అని తెలుసుకున్నాను. దీని మీద నాకు ఆసక్తి లేదు

జాయాత్మజార్థపశుభృత్యగృహాప్తవర్గాన్
పుష్నాతి యత్ప్రియచికీర్షయా వితన్వన్
స్వాన్తే సకృచ్ఛ్రమవరుద్ధధనః స దేహః
సృష్ట్వాస్య బీజమవసీదతి వృక్షధర్మః

భార్యా పుత్రులూ పశువులూ భృత్యులూ గృహములూ మిత్రులూ ఆప్తులూ, వీరందరినీ ఎవరికోసం కష్టపడి పోషిస్తున్నాడు. నా వారు ఆనందముగా ఉంటే నాకు ఆనందం అంటాడు. అలా అనే శరీరమే శాశ్వతం కాదు. ఇంక వారు శాశ్వతం ఎలా అవుతారు. చివరకు ఆ శరీరమే శ్రమనూ పాపాన్ని మూటగట్టి వెళ్ళిపోతుంది. మళ్ళి ఇంకో జన్మ వస్తుంది.ఇంకో శరీరానికి బీజం వేసి తాను వెళ్ళిపోతుంది. చెట్టు బాగా పెరుగుతుంది, నాలుగు బీజాలు వేసి తాను వెళ్ళిపోతుంది. అలాగే ఈ దేహం ఇంకో దేహాన్ని సృష్టిస్తుంది.ఈ దేహానికి లేని సంతోషం వేరే దేహానికి ఎలా ఉంటుంది

జిహ్వైకతోऽముమపకర్షతి కర్హి తర్షా
శిశ్నోऽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్
ఘ్రాణోऽన్యతశ్చపలదృక్క్వ చ కర్మశక్తిర్
బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునన్తి

మంచి రుచి కావాల్ని నాలుక, మంచి రూపం కావాలని కన్ను, చెవి మంచి పాట కావాలని, ముక్కు మంచి వాసన కావాలని, చర్మం మంచి స్పర్శ కావాలని అంటుంది. కాళ్ళు పరుగెత్తాలని, చేతులు లాగుదామనీ అంటాయి. ఇవన్నీ కలసి ఒకే సారి ఇవన్నీ కావాలి అంటే ఏమిటి పరిస్థితి. నలుగురైదుగురిని పెళ్ళి చేసుకుంటే వారంతా నా ఇంటికి రా అంటే నా ఇంటికి రా అని లాగినట్లు ఇంద్రియాలన్నీ ఇలా గోల చేస్తూ ఉంటాయి. మనని చేదిస్తూ ఉంటాయి.

సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్యా
వృక్షాన్సరీసృపపశూన్ఖగదన్దశూకాన్
తైస్తైరతుష్టహృదయః పురుషం విధాయ
బ్రహ్మావలోకధిషణం ముదమాప దేవః

పరమాత్మ తన మాయా శక్తితో అనేక పురాలను (శరీరాలను) ఏర్పరచాడు. పశువులనూ చెట్లనూ పురుగులనూ మత్స్యములనూ సృష్టించి, అవి తృప్తిని కలిగించకుంటే మానవ శరీరాన్ని నిర్మింప్చేసి " ఈ మానవ దేహం బాగుంది. పరమాత్మను చెందడానికి అవకాశం మానవ దేహములోనే ఉంది" అని సంకల్పించాడు. అట్టి మానవ జన్మ లభించి కూడా మోక్షం సంపాదించకపోతే బ్రహ్మ అనందం ఏమవుతుంది. ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తరువాత ఎప్పుడో దొరుకుతుంది.

లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసమ్భవాన్తే
మానుష్యమర్థదమనిత్యమపీహ ధీరః
తూర్ణం యతేత న పతేదనుమృత్యు యావన్
నిఃశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్

ఈ మానవ జన్మ నిత్యం కాకున్నా ప్రయోజనం కలిగిస్తుంది. మోక్షం కలిగిస్తుంది. అలాంటి దేహం పొందితే ముక్తి కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆ దేహముతో పడిపోకూడదు. మానవ దేహములో మోక్షం సంపాదించడానికి మార్గాలు అన్ని వైపులా ఉన్నాయి. ఇలాంటి మానవ దేహం పొంది, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రయత్నించాలి.

ఏవం సఞ్జాతవైరాగ్యో విజ్ఞానాలోక ఆత్మని
విచరామి మహీమేతాం ముక్తసఙ్గోऽనహఙ్కృతః

నాయనా ఇలా నాకు వైరాగ్యం పొంది నేను విజ్ఞ్యానాన్ని పొంది ఒంటరిగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాను

న హ్యేకస్మాద్గురోర్జ్ఞానం సుస్థిరం స్యాత్సుపుష్కలమ్
బ్రహ్మైతదద్వితీయం వై గీయతే బహుధర్షిభిః

ఒక్క గురువునుండే పరిపూర్ణ జ్ఞ్యానం ఎవరికీ రాదు. బ్రహ్మ అద్వితీయం అని చాలా మంది ఋషులు చెబుతారు. ఎక్కువ మంది గురువులను ఆశ్రయిస్తే రక రకాల ధర్మాలూ స్వరూపాలూ తెలిసి పరమాత్మ స్వరూపం బాగా అర్థమయ్యి పరమాత్మను పొందుతాము. అందుకు ఒకరి కన్నా ఎక్కువమంది గురువులే కావాలి. భగవద్రామానుజులకు ఐదుగురు గురువులు కలరు.

శ్రీభగవానువాచ
ఇత్యుక్త్వా స యదుం విప్రస్తమామన్త్ర్య గభీరధీః
వన్దితః స్వర్చితో రాజ్ఞా యయౌ ప్రీతో యథాగతమ్

ఇలా అతని ఆమంత్రించి ఆజ్ఞ్యను పొంది ఆ విప్రుడు నమస్కరించబడి వచ్చిన దారిలోనే వెళ్ళాడు.

అవధూతవచః శ్రుత్వా పూర్వేషాం నః స పూర్వజః
సర్వసఙ్గవినిర్ముక్తః సమచిత్తో బభూవ హ

అవధూత వాక్యాన్ని విని అన్ని సంగముల నుండీ విముక్తి పొంది సమచిత్తుడయ్యాడు.

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts