Google+ Followers

Followers

Friday, 31 May 2013

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?:


జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది. 

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం.

Popular Posts