వివాహ ప్రయత్నాలు ఆలశ్యమవుతున్నా, వివాహమైన తదుపరి సమస్యలు తలెత్తుతున్నా, అందరికీ వెంటనే గోచరించేది కుజదోషం. కుజదోషం వున్నవారు కుజదోషం వున్న వారినే వివాహమాడాలని అంటాము. మరి ఈ కుజదోషం ఎవరెవరికి వుంటుంది ? నిజంగా కుజదోషమున్నవారికి లేదని, కోజదోషం లేనివారికి వున్నదని చెప్పే పండితులు కూడా ఈమధ్యకాలంలో సిద్ధమవుతున్నారు. ఏ చిన్నపాటి సమస్యకైనా, ఓ పండితుడిని దంపతులు గానీ, దంపతుల తల్లితండ్రులు గానీ విచారించగానే, ముందుగా ఆ పండితుల వారు సెలవిచ్చేది కుజదోషం వుందని లేక కాలసర్పదోషముందని, ఈ కుజదోషం వలన భార్య భర్తలలో ఒకరికి మరణం త్వరలో వుందని, భయభ్రాంతులయ్యే సంభాషణలతో పండితుడు చెప్పగానే, ఆ మాటలు విన్న దంపతులకో లేక వారి తల్లితండ్రులకో ప్రాణాలు అప్పుడే గాలిలో కలిసిపోయే విధంగా వుంటాయి.
ఈ కుజదోషం గురించిన సంపూర్ణ చరిత్రను గురించి తెలుసుకుంటే ఎవరు... ఏ మాట చెప్పినా భయపడాల్సిన అవసరము వుండదు. రాశి చక్రములో మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. అగ్నితేజో సంపన్నుడు. ఇట్టి కుజుడు జాతక చక్రములో జన్మ లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజదోషం వుందని భావం. మరి 2 వ స్థానంలో కుజుడు వుంటే... కుటుంబ ధన సంపత్తులు కొన్ని కొన్ని కారణాల వలన హరించుకుపోతాయని భావం. ఇక 4 వ స్థానంలో కుజుడు వుంటే గృహలక్ష్మి భాగ్యములు దెబ్బతినటం, వాహన సంభందిత ప్రమాదములు, ఆరోగ్య లోపములు ఏర్పడునని గ్రహించాలి. 7 వ స్థానంలో కుజుడు వుంటే కళత్ర సుఖ భోగ భాగ్యములు తగ్గిపోవునని, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ప్రారంభమగునని భావం. 8 వ స్థానంలో కుజుడుంటే ఆయుర్భాగ్యం తగ్గునని, పూర్ణ ఆయుర్దాయమునకు దూరమని భావం. 12 వ స్థానంలో కుజుడు వుంటే మోక్షలక్ష్మీ భాగ్యములు అంతరించి పోతాయని విశ్వసించాలి. కుజుడు ఆయా స్థానాలలో వుండిన పురుషునికి భార్య వియోగము, భార్యకు భర్త వియోగము కల్గును.
ఈ వియోగం ఎప్పుడు కలుగుతుంది ? వివాహం కాగానేనా ? లేక కొన్ని సంవత్సరాలు దాంపత్యం జరిగిన తదుపరా ? ఖచ్చితమైన సమాధానం ఏమిటంటే... ఏ జాతకులైన కుజదోషం వుంటే.... దాని ప్రభావం, కుజ మహాదశ జరిగే సమయంలోనే సమస్యలు వస్తాయి. ముందు రానే రావు. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మొట్ట మొదట గ్రహించాలి. ఇక 27 నక్షత్రాలలో జన్మించిన వారి వివరాలలోకి వెడితే అందరికీ తెలియని ఆసక్తికర అంశాలెన్నో రేపటి రెండవ భాగంలో తెలుసుకుందాము.