Followers

Saturday, 20 July 2013

ఎవరి పని వారు చేయడం ఉత్తమం

చం: పిదపిదయై రహించు సుకవిత్వము, శౌర్యము, దానగానముల్‌
పొదలవలెన్‌, నిసర్గతను పుట్టుక తోడనె, ఈర్ష్య పెంపునన్‌
జదివిన, నేర్చినన్‌, మివుల శ్రద్ధ వహించిన, నభ్యసించినన్‌
బదిలపడంగనేర, వలప్రాక్సుకృతంబునగాక యెందులన్‌!

‘స్వర్ధయావర్ధతే విద్యా’ అన్నారు పెద్దలు.. స్పర్ధ ఎప్పుడు మనస్పర్ధలు గాకూడదు. మనస్పర్ధలు వ్యక్తిగత విరోధానికి దారితీస్తాయి. అయితే విద్యలలో స్పర్ధవహిస్తే ప్రత్యర్థి మీద పట్టుదల కోసమైనా, ప్రత్యర్థిని ఓడించడానికైనా విద్య అలవడుతుందని పెద్దల అభిప్రాయం. అందుకే శ్రీ గురజాడ అప్పారావు గారు కూడా

‘‘పూను స్పర్ధలు విద్యలందే

వైరములు వాణిజ్యమందే ’’
 

hitoktiఅన్నారు ముత్యాల సరాలులో వ్యక్తిగతమైన ద్వేషాలు ఎప్పుడూ ఎవ్వరికీ ఉండకూడదు గానీ, విద్యలో, ప్రజ్ఞలో, ప్రతిభలో, ఒకరిని మించి మరొకరు ఉన్నతస్థితిని చేరుకోవాలని పోటీ పడుతుంటే ఆ విద్యలూ, ప్రతిభా, ప్రజ్ఞా, ఆదేశానికీ, సమాజానికీ ఉపయోగపడి, పురోభివృద్ధి సాధించటానికి దోహదపడతాయి. అయితే కొన్ని విద్యలు పూర్వజన్మ సుకృతం కొద్దీ జన్మతః ఏర్పడినవే రాణిస్తాయి కానీ, ఒకడు సాధించిన విద్యని అనుకరిస్తూనో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో తానూ సాధించి, జన్మతః దైవానుగ్రహం వల్ల ఏర్పడిన విద్యావంతుడి కంటే తానే అధికుడననే గర్వం, దర్పం ప్రదర్శించడానికో నేర్చుకుంటే అది అంత రాణించదు. దానివల్ల ‘రససిద్ధి’ కలగదు అంటాడు భర్తహృరి. చాలా విషయాలలో ఇది యదార్థం అనిపిస్తుంది. 

‘‘పిట్టకొంచెం కూత ఘనం’’ అన్న సామెత బాల విద్వాంసులను చూసినప్పుడు పుట్టిందే! చిన్నపిల్లలో, ఈ రోజుల్లో కూడా అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న పిల్లలని చాలామందిని చూస్తున్నాం, చాలా మంది గురించి వింటున్నాం! అత్యద్బుతంగా పాటలు పాడే పిల్లలని చూసినప్పుడు అది ‘పూర్వజన్మ సుకృతం’ అంటూ ఆ పిల్లలని ప్రశంసిస్తాం! ఈ విధంగా పూర్వజన్మ సంస్కారం వల్ల అచ్చిన కళలని తప్పక ప్రోత్సహించాలని అన్ని దేశాలలో గల మేధావులందరూ ముక్త కంఠంతో ఉద్బోధిస్తున్నారు. పూర్వజన్మ సుకృతం కొద్దీ అలవడే ‘కళల’లో ముఖ్యంగా నాట్యము, నటన, కవిత్వం, సంగీతం, సంస్కారంలో శౌర్యమూ, దానగుణము ప్రముఖమైనవి. కొందరికి వంశపారంపర్యంగా వచ్చే కులవృత్తుల వల్ల కూడా, మరికొన్ని కళలు అలవడతాయి. 

అవి ‘శిల్పాలు’ చెక్కడం, చ్త్రిలేఖనం, మట్టితో బొమ్మలు, కుండలు, కూజాలు చేయడం వంటివి, పాకశాస్త్రం, వాహనాలు నడపడం ఇత్యాదివి!! ఈ విధంగా పుట్టుకతో వచ్చే విద్యలని ప్రోత్సహించిననాడు జీవనోపాధికి ప్రయాసపడవలసిన అవసరం వుండదు.అందుకే మనపూర్వీకులు విద్య మీద శ్రద్ధ పెట్టరా! మనుషూల మీద కాదు అంటూ హితబోధ చేసేవారు. విద్య అంటే తనకు ఏది ఇష్టమో, దేనిని నేర్చుకోవాలని వుందో దానిపైననే శ్రద్ధ పెట్టాలిగానీ, ‘తన పొరుగు వాడు ఏది చేస్తే దానినే నేనూ చేస్తాను’ అనే తత్త్వం మంచిదికాదు. భర్తృహరి లోక దార్శినికుడు కాబట్టి మానవులకు ఏది హితమైనదో తనసూక్తుల ద్వారా తెలియచెప్పి, వివేకవంతులని చేశాడు.

‘‘విద్యాశ్చతస్రో2సాధ్యాస్సుర్జన్మనా సహ సంభవాః

గాంధర్వంచ, కవిత్వంచ, శూరతా దానశీలతా’’ అన్నాడు!


ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల తన శరీరాన్ని తానే దహిం చుకుంటాడు గానీ, ఎవరిని ద్వేషిస్తున్నామో వారికేమీ జరగ దు అంటాడు! ఈర్ష్య గలవారికి ‘‘ఒడవిని భగ్గు భగ్గుమని యుద్దవిడిన్‌ దహియించు నెంతయున్‌’’ అన్నాడు. కాబట్టి ఒకళ్ల మీద ద్వేషం, ఈర్ష్య, అసూయ మనకు అనవసరం, అటువంటి వాళ్లని ‘దూరముననె పరిహరించి’ మన బ్రతుకేదోమనం బ్రతకడం ఉత్తమం! మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో గ్రహించుకుని దానినే పదిల పరచుకుని, దాని ద్వారానే జీవితాన్ని గడపడం ఉత్తమోత్తమం!! సర్వేభద్రాణి పశ్యంతు, మా కశ్చిద్‌ దుఃఖ భాగ్భవేత్‌!’’

Popular Posts