మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు.
కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు. సాలగ్రామ శిలయందు చరచరాత్మకాలయిన మూడు లోకాలు ఇమిడి ఉంటాయట. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తితో పూజిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం ఫలానికి సమానమవుతుంది. అంతేకాదు కోటి గోవులను దానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. సాలగ్రామ పూజవల్ల శివకేశవులిద్దరినీ పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. సాలగ్రామ శిలకు షోడశోపచార విధానాలు అర్జించిన భక్తులకు యావత్ కల్పాంతం వరకూ వైకుంఠాన నివసించే భాగ్యం కలుగుతుంది. సాలగ్రామానికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పూజించినచో మరుజన్మ లేకుండా ముక్తి లభిస్తుందట. సాలగ్రామాన్ని స్మరించిన, దర్శించిన, నమస్కరించిన సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామ శిలయందు వుంచిన అన్ని పదార్థాలు పవిత్రములవుతాయి. దీనిని ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినచో, పితృదేవతలకు పైలోకాలలో శాశ్వత సుఖాలు లభిస్తాయట. సాలగ్రామ తీర్థాన్ని సేవించినచో వెయ్యిసార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితంకన్నా, ప్రాయశ్చిత్తములందు ఆచరించే దానాల ఫలితాలకన్నా అధిక ఫలితం కలుగుతుందంటారు. యోగాశాస్త్రం, సాంఖ్యాశాస్త్రాలు తదితర ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియకున్నా, చదవకున్నా, ఒక్కసారి సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందట. తటాకాలందు సాలగ్రామాన్ని ఉంచి, ఆ నీటితో స్నానమాచరిస్తే సర్వతీర్థాలందు స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందంటారు. అలాగే సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకుంటే, పవిత్ర గంగాస్నానం చేసినట్లే అవుతుందట. సాలగ్రామ తీర్థం అత్యంత పవిత్రమైనది. విశేషమైన మహత్తు కలది. అలాంటి తీర్థాన్ని సేవించినవారికి పునర్జన్మ ఉండదట. విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని విష్ణ్భుక్తుడైన సత్ బ్రాహ్మణునికి దానమిస్తే వంద యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి విశేషాలున్న ఈ సాలగ్రామ శిలకు ఈ పద్నాలుగు లోకాలలో సరిపడే వేరొక శిల లేదని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితోగాని, రంగులతోగాని, కేశవ నామాన్ని రాస్తే, కోటి కల్పాల వరకూ స్వర్ణంలో నివసించే భాగ్యం కలుగుతుందట. పూజాపీఠమందు సాలగ్రామాన్ని అమరిస్తే సమస్తమైల పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణమైన ఫలితాలు సొంతమవుతాయి. సాలగ్రామాలను ఆవుపాలతోగాని, పంచామృతంతోగాని శుద్ధి చేయాలి. ‘రుద్రాక్ష ధారణ’ నియమాలనే సాలగ్రామ పూజలందు పాటించాలి. ప్రత్యేక సమయాలందు, సంక్రమణ కాలాలందు, గ్రహణ సమయాలందు ఆయా సాల గ్రామాల ననుసరించి ఆయా దైవ జపాలను 1008 సార్లు చేస్తే లేదా చేయించుకుంటే అలాంటి సాలగ్రామాల శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామాలందు ఉన్న చక్రాలననుసరించి వాటిని పిల్వడం జరుగుతోంది. ఏకచక్రముంటే సుదర్శనమని, రెండు చక్రాలుంటే లక్ష్మీ నారాయణమని, మూడు చక్రాలుంటే అచ్యుతుడని, నాలుగు చక్రాలుంటే జనార్థుడని, ఐదు చక్రాలుంటే వాసుదేవుడని, ఆరు చక్రాలుంటే ప్రద్యుమ్నుడని, ఏడు చక్రాలుంటే సంకర్షణుడని, ఎనిమిది చక్రాలుంటే పురుషోత్తముడని, తొమ్మిది చక్రాలుంటే నవ వ్యూహమని, పది చక్రాలుంటే దశావతారమని, పదకొండు చక్రాలుంటే అనిరుద్ధుడని, పనె్నండు చక్రాలుంటే దాదశాత్ముడని, పదమూడు చక్రాలకన్నా ఎక్కువ చక్రాలుంటే ‘అనంతమూర్తి’ అనే పేర్లతో పిల్వడం జరుగుతోంది. సర్వపాపహరమైనది, సర్వచింతనల నుంచి దూరం చేసేది, సర్వదేవతా పూజా ఫలితాలనిచ్చేది, సర్వశ్రేయస్కరమైనదని అయిన సాలగ్రామాన్ని పూజించడం, మానవుల అదృష్ట్భాగ్యంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి సాలగ్రామాన్ని భక్తితో పూజించడం భక్తిముక్తిలకు మార్గం సుగమం చేసుకోవడంగా చెబుతారు.