Followers

Friday 19 July 2013

సాంఖ్యయోగము

అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు.
కాని అర్జునుడు "నేను గురువులను,పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను.అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా.నాకు దుఃఖం ఆగడంలేదు.నేను నీ శిష్యుణ్ణి.నాకేది మంచిదో నీవే చెప్పు"అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు.అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో

"దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు.తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని,వర్తమానం గురించికాని బాధపడరు.అయినా నేను,నువ్వు,ఈ రాజులు గతంలోనూ ఉన్నాము.భవిష్యత్తులోనూ

ఉంటాము.బాల్యము,యవ్వనము,ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.సుఖదుఃఖాలు శాశ్వతం కావు.ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు.
ఆత్మ లక్షణాలు 
దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం.ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు.ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు.ఇది
సనాతనము అనగా ఎప్పుడు ఉండేది.మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది.అగ్నికాని,గాలి కాని,నీరు గాని మరియు
ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు.ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు.పుట్టిన శరీరం చావకతప్పదు.మరలా పుట్టక తప్పాడు.దీనికి బాధపడనవసరం లేదు.అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.

క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం.నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు.అపకీర్తి వస్తుంది.అమర్యాద పాలవుతావు.శత్రువులు చులకన చేస్తారు.మరణిస్తే

స్వర్గం,గెలిస్తే రాజ్యం పొందుతావు.సుఖదుఃఖాలను,జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు.కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.

ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు.ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది.కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ

నిశ్చలమైన ధ్యానంకాని,బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు.ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై,సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి.బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి,జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది.

పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.


జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు.ఈ బుద్ది కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు.నీ మనసు స్థిరం కావాలి.

స్థితప్రజ్ఞుడి లక్షణాలు
అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు,నడవడిక గురించి అడుగగా కృష్ణుడు
"అన్ని కోరికలను వదిలి,దుఖానికి కలత పొందక,సుఖానికి పరవశించక,అనురాగము,కోపము,భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు"అన్నాడు.
ఇంద్రియనిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది.

విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి,అది నెరవేరకపోవడంవలన కోపం,ఆ కోపం వలన అవివేకం,అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం,బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.


విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం ,కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు.నిశ్చలత్వం లేని వాడికి శాంతి,అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు.

లౌకిక విషయాలందు నిద్రతోను ,సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.
బ్రాహ్మిస్థితి
సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా,గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు.అహంకారాన్ని,కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు.ఈ స్థితిని ఎవరైతే జీవించిఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు

Popular Posts