Followers

Tuesday 9 July 2013

బోనాలు వేడుకలు (Bonalu Celebrations)



శక్తి స్వరూపిణి అయిన మహాకాళిని కొలిచే బోనాలు ఉత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయం దగ్గర మొదలైన లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. బోనాలు వేడుకలకు దేవి ఆలయాలనే కాకుండా వీధులన్నిటినీ వేపాకులతో అలంకరిస్తారు. దేవిని ఆరాధిస్తూ పాడే పాటలతో ఆయా ప్రాంతాలు కోలాహలంగా ఉంటాయి.
హైద్రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, ఇంకా ఇతర తెలంగాణా ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు బోనాలు ముఖ్యమైన పండుగ. ఏటా ఆషాఢమాసంలో వచ్చే బోనాలు మూడు వారాలపాటు సందడిగా కొనసాగుతాయి. 
ఆషాఢమాసంలో కాళీమాత పుట్టింటికి వెళ్తుందని విశ్వసించే భక్తులు బోనాలు వేడుకల సందర్భంలో దేవి గుడికి వెళ్ళి దర్శించుకుంటారు. అమ్మవారు తమ ఇంటికి వచ్చిందని తలచి, ప్రేమగా బోనాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు మేకపోతును లేదా కోడిపుంజును బలి ఇచ్చే సంప్రదాయం ఉంది.
బోనాలు సంబరాలు ఎల్లమ్మ దేవతను పూజించడంతో మొదలౌతాయి. ఆఖరి రోజున కూడా ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇతర రోజుల్లో పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలను పూజిస్తారు. బోనాల వేడుకలకు ఈ గుళ్ళను ఘనంగా అలంకరిస్తారు. రెండవ రోజు జరిగే పండుగను రంగం అంటారు. ఈ కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. కోపోద్రిక్తుడైన పోతరాజు చేతికి మేకపోతును ఇస్తారు. అతడు దంతాలతో మేకపోతును కొరికి, తల, మొండెం వేరుచేసి పైకి ఎగరేస్తాడు.
బోనం అనే పదం ఖచ్చితంగా భోజనం నుండి వచ్చినదే. మహంకాళికి కుండల్లో అన్నం వండి, పాలు, బెల్లం, ఉల్లిపాయలు మొదలైనవి జతచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని మట్టి లేదా రాగి పాత్రల్లో మాత్రమే తీసికెళ్ళాలనేది నియమం. పాత్రలకు పసుపు, కుంకుమ, సున్నపు బోట్లు పెట్టి, వేప ఆకులు లేదా చిన్న వేప మండలు కట్టి, తలపై పెట్టుకుని, లయబద్ధమైన డప్పులు మొగిస్తుండగా తీసుకు వెళ్తారు.
అమ్మవారి సోదరుడు పోతరాజుకు ప్రతిగా ఒక వ్యక్తిని అలంకరిస్తారు. ఆ పోతరాజు సమక్షంలో బృందాన్ని నడిపిస్తారు. పోతరాజుగా బలంగా ఉన్న వ్యక్తిని ఎన్నుకుని, ఎర్రటి ధోవతి కడతారు. శరీరమంతా పసుపు రాసి, నుదుటిమీద కుంకుమ పెడతారు. ఈ పోతరాజు కాలికి గజ్జెలు కట్టుకుని, దప్పులకు అనుగుణంగా నర్తిస్తాడు.
బోనాల ఉత్సవాలకు ఎక్కడికక్కడ బృందాలుగా సమకూరి దేవి ఆలయాలకు వెళ్తారు. కొందరు పూనకం వచ్చిన స్త్రీలు మహంకాళిని స్మరిస్తూ, డప్పు మోతలకు అనుగుణంగా నర్తిస్తారు. బోనాలు వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కర్రలకు రంగు కాగితాలు అమర్చిన ''తొట్టెలు'' రూపొందిస్తారు. ఒక్కో బృందం ఒక్కో తొట్టెను దేవికి కానుకగా సమర్పిస్తుంది.
మహంకాళికి బోనాలు నివేదించడం పూర్తయిన తర్వాత, దాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుని బంధుమిత్రులతో కలిసి మాంసాహార విందు ఆరగిస్తారు.

Popular Posts