Followers

Tuesday, 2 April 2013

ధ్యానం గురించి మనలో చాలా మందికి అపోహ. ధ్యానం ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలి..?


ధ్యానం గురించి మనలో చాలా మందికి అపోహ. ధ్యానం ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలి..?


ఇప్పుడు ఆధునిక వైద్య నిపుణులు సైతం అనేక మంది చెబుతున్న మాట... ‘‘అనేక వ్యాధులకు మూలం మానసిక ఒత్తిడి. దాన్ని తగ్గించుకోడానికి ధ్యానం ఒక మంచి మార్గం. ప్రతి రోజూ ధ్యానం చేయండి. ఒత్తిడులను తగ్గించుకోండి’’ అని సూచన చేస్తూ ఉంటారు. 

ధ్యానం గురించి మనలో చాలా మందికి అపోహ. ఎలా చేయాలి, ఏం చేయాలి... అని. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని, మన శ్వాసపైనే ధ్యాస నిలిపి, అడ్డదిడ్డంగా వెళ్లే ఆలోచనలను నియంత్రించి ప్రశాంతంగా ఉండటమే ధ్యానం. మరి ఆలోచనలు రాకుండా ఉంచడం ఎలా? ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. మొదటి రోజున ఆలోచనలు అడ్డంగా పరిగెడుతుంటాయి. అలా క్రమం తప్పకుండా చేస్తూంటే క్రమంగా పరిస్థితి మెరుగవుతూ పోతుంది. కొద్ది రోజుల్లో ప్రశాంతత పొందగలుగుతారు. మీ ధ్యానంపై మీకే నమ్మకం కుదురుతుంది. అదే స్థితిని ఎప్పుడూ ప్రశాంతంగా కొనసాగనివ్వడం అన్నదాన్ని నిత్యజీవితంలోనూ ఆచరించగలుగుతారు. క్రమంగా ఒత్తిడి ఏర్పడ్డ పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇదీ ధ్యానం చేస్తున్నప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన పరిస్థితి. 

ధ్యానం ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలి..? 

ధ్యానం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా చేయవచ్చు. తెలుసుకోవాల్సిందల్లా ఒడిదొడుకులు, ఒత్తిడి కలిగించే పరిస్థితులను ప్రశాంతంగా ఉంచుకోవడమే ధ్యానం. దానికి ఎలాంటి నియమాలూ లేవు. 
ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు. కాకపోతే ఆ పరిస్థితిని అభ్యసించే ముందుగా రోజూ నిర్ణీతంగా ఒక టైమ్‌లో చేయడం మంచిది. ఎప్పుడైనా ఎలాగైనా చేయవచ్చు అనడానికి ముందుగా ఇలా నిర్ణీతంగా ఒక సమయంలో చేయమనడం ఎందుకు? ఇది మంచి ప్రశ్న. మనలో కంప్యూటర్ కీబోర్డుపై టైపింగ్ ఆపరేట్ చేసేవారు చాలా మంది ఉంటారు. 

మీ అందరికీ ధ్యానం అనేది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ... మొదట కీ-బోర్డులో ఏ అక్షరం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ‘ఏ, ఎస్, డి, ఎఫ్... సెమీ కోలన్, ఎల్, కె, జె... అనే అక్షరాలపై మన వేళ్లను ఉంచుతాం. కొంత సేపు ఆ అక్షరాలను కొట్టి చూస్తాం. ఆ తర్వాత ఏ, ఎస్, డి, ఎఫ్ లను కొట్టడం వల్ల టైపింగ్ రాదు. కానీ... టైపింగ్ రావడానికి ఆ అక్షరాల వరసను మొదట అభ్యసించాల్సిందే. 

ద్యానం కూడా అంతే. ఒక దశ వచ్చాక ఏ పరిస్థితుల్లో అయినా ధ్యానంలోనే ఉంటూ మనసును ప్రశాంత పరుచుకునే సామర్థ్యం మీకు వస్తుంది. అయితే అంతకంటే ముందు మాత్రం ఆ స్థితి వరకూ చేరుకోవడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతిలో... కాసేపు, కాసేపు చొప్పున వ్యవధి పెంచుకుంటూ పోవడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం అని గుర్తుంచుకోండి. 

కడుపు నిండా భోజనం చేసి ధ్యానానికి కూర్చోకండి. నిద్ర రావచ్చు. అలాగని కడుపు ఖాళీగా ఉంచేసి ధ్యానానికి ఉపక్రమించకండి. ధ్యానంపై దృష్టి చాలాసేపు నిలవకపోవచ్చు. మీకు ధ్యానం అలవాటయ్యే వరకూ ధ్యానానికి కూర్చునే ముందర కడుపును పూర్తిగా ఖాళీగా ఉంచకండి, అలాగని పూర్తిగా నింపేసీ ఉంచకండి.  




శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నవారు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వంలోని శక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ అనంతమైన శక్తి మనలోకి నిండుతున్నట్లుగా భావించండి. ఆ శక్తి మనలో ఎంతైనా నిండుతుంది. దానికి పరిమితులు లేవు. డ్రమ్‌లో నీళ్లు నిండాక ఎక్కువైతే పొర్లిపోయినట్లుగా... మన శరీరంలోకి కొద్దిగా శక్తి ప్రవేశించాక పొర్లిపోయేందుకు అవకాశమే లేదని గుర్తుంచుకోండి. ఎంతగా శక్తి నిండితే మనకు అంత ప్రయోజనం అంటూ పాజిటివ్‌గా అనుకుంటూ ఉండండి. మీరు శ్వాస తీసుకునే సమయంలో వచ్చే అపరిమితమైన ఆలోచనలను క్రమంగా తగ్గించుకోడానికి ఇది ఉపకరిస్తుంది.

ప్రకృతికి దగ్గర్లో ధ్యానం చేయడం మంచిది. ప్రకృతిలో అనంతమైన శక్తి ఉంటుంది. ప్రకృతికి మనం దగ్గరగా ఉన్న కొద్దీ అది మనల్ని చేరడానికి పట్టే వ్యవధి తగ్గుతుంది. అందుకే అడవులు, కొండలు, నదులు, తోటలు వంటి ప్రదేశాల్లో ధ్యానం చేయడం మంచిది.

Popular Posts