Followers

Wednesday, 10 April 2013

ఏం చేస్తే సులభంగా పుణ్యాన్ని సంపాదించు కోవచ్చు? ఏం దానం చేస్తే ఏం ఫలితం ?


శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంతటి ఆ లయకరకుడు మానవాళికి పుణ్యసంపాదన కొన్ని కొన్ని సులభ మార్గాలని ఉద్దేశించాడు. ఈ విషయాలన్నీ మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఒక రోజు పార్వతిదేవి పరమేశ్వరుడిని మానవులు ఏం చేస్తే సులభంగా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చో చెప్పమని అడిగినప్పుడు శివుడు స్వయంగా ఆమెకు ఇలా వివరించాడు.
    ప్రాణాన్ని కలిగి ఉన్న ప్రతి జీవికి నీరు ఎంతో అవసరం. అలాంటి జలాన్ని దానం చేయడం ద్వార స్వర్గ సుఖం కలుగుతుంది. బంగారాన్ని దానం చేస్తే దాతకు పవిత్రత చేకూరుతుంది. గోవు ప్రత్యక్ష దైవమె. అలాంటి గోవును జ్ఞానవంతుడికి దానంమిస్తే ఆ గోవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు దాతకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందులో కపిల గోవుదానం ఇంకా ప్రశస్తమైనది. భూమిని దానం చేసిన వారికి భూమి ఉన్నంతకాలం స్వర్గసౌఖ్యం కలుగుతుంది. భూమి నుంచి అనేకానేక వస్తువులు ఉద్భావిస్తుంటాయి. కనుక భూమిని దానం చేసిన వారికి ఆయా వస్తువులు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. భూదానం వల్ల ఎన్నెన్నో పాపాలు తొలగిపోతాయి. దానాలలో కన్యాదానంవల్ల దేవతలంతా సంతోషిస్తారు. కన్యదాతకు తేజం, సంపద, కీర్తి కలుగుతాయి.



విద్యను మంచి శిష్యుడికి దానం చేస్తే దానివల్ల గురువుకు తరిగిపోని ఆనందం కలుగుతుంది. తగిన ధనమిచ్చి పేదలకు విద్యను చెప్పించటం వల్ల విద్యాదాన ఫలం లభిస్తుంది. నువ్వుల రాశిని దానమిస్తే అగ్నిష్టోమయజ్ఞం చేసినంత ఫలం, వస్త్రాలను దానమిస్తే దీర్ఘాయువు, గోడుగుని ఇస్తే బాధలనుంచి విముక్తి, దాసదాసిజనులను దానమిస్తే కర్మ విముక్తి, దీపదానం వల్ల నిర్మలాత్మత. ప్రవాహాన్ని, నదిని దాటడానికి ఎవరికైనా సహయంచేస్తే వ్యసనాల వల్ల కలిగిన పాపాలు తోలగేలాంటి పుణ్యం లభిస్తుంది. అందరూ నడిచే దోవను శుభ్రం చేస్తే సంతానప్రాప్తి, ఔషదాల దానం వల్ల రోగ బాధల నివృత్తి, బాటసారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల శరీర సౌఖ్యం కలుగుతాయి.
    యజ్ఞాలు వైదికమని, లౌకికమని రెండు విధాలుగా ఉన్నాయి. రుత్విక్కులకు తృప్తి కలిగేల చేసేది వైదిక యజ్ఞం. దేవతలకు మహోత్సవాలు చేయడం, భజనలు నృత్యాలను ఏర్పాటు చేయడం, గంధం పూలమాలలు దుపదీపాలు నైవేద్యాలు భక్తితో నివేదించటం లౌకిక యజ్ఞం. ఈ రెండు హితమైనవే. చక్కగా శాస్త్రవిధిగా చేసిన యజ్ఞానికి దాన, ధర్మాలు సాటిరావు. దేవతలు మానవుల మనసులను గమనిస్తూవుంటారు కనుక చిత్తశుద్దితో యజ్ఞాలైనా, దానాలైనా చేయాల్సి ఉంటుంది. పితృకార్యాలు చేయడం వల్ల కూడా గొప్పపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కార్యాలు చేసేటప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండటం ముఖ్యం. సత్ప్రవర్తన కలిగిన వారిని అర్చించి పితృకార్యం చేసే రోజున భోజనం పెట్టి, వస్త్రాలను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సర్వత్ర శుభం కలుగుతుందని పార్వతికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు.

Popular Posts