Followers

Tuesday, 2 April 2013

ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం...ఈ మూడు కలిస్తేనే యోగా.

ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం...ఈ మూడు కలిస్తేనే యోగా. 
ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం...ఈ మూడు కలిస్తేనే యోగా. ఎటువంటి కదలికలు, ఇబ్బందులు లేకుండా కూర్చొంటేనే మనసు దేనిపైనైనా కేంద్రీకృతమవుతుంది. అందుకు ఎవరికి వీలైన ఆసనం వారు ఎంచుకోవాలి. చక్కగా మఠం వేసుకోవచ్చు. అర్ధ పద్మాసనం, పద్మాసనం, స్థిరాసనం...ఏదైనాసరే కంఫర్ట్‌గా ఉండాలి. ఆపై తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మనసు, శరీరం లక్ష్యం కోసం సిద్ధం చేసుకున్నట్టు అవుతుంది. ఆ తరువాత ధ్యానం చేయాలి. అంటే మనసును ఏదో ఒక అంశంపై కేంద్రీకరించాలి. అది ఇష్టదైవమైతే మంచిది. తెలిసిన ప్రార్థనతో ప్రారంభించాలి. ధ్యానం అనుకున్నంత సులువుకాదు. కూర్చొని కళ్లు మూసుకుంటే మనసు పరిపరివిధాలా ఆలోచిస్తుంది. ఒకంతట ఏకాగ్రత కుదరదు. అది సాధించకపోతే ఎంతసేపు కూర్చొన్నా వృధాయే. అందుకని గురువులు శ్వాసపై దృష్టి పెట్టాల్సిందిగా సూచిస్తారు.

మనసుకు, శ్వాసకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎలాగంటే..మనసు ఆందోళనగా ఉంటే గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది. శ్వాస పెరుగుతుంది. అదే మనసు ప్రశాంతంగా ఉంటే...శ్వాస కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఈ రెండింటిలో దేనిపై పట్టు సాధించినా రెండోది నియంత్రణలో ఉంటుంది. మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. అదే శ్వాస అయితే నియంత్రించుకోవచ్చు. అందుకని దానిపై పట్టు తెచ్చుకోమని సూచిస్తారు. దాన్నే ప్రాణాయామంగా వ్యవహరిస్తారు. అంటే గాలిని పీల్చడం, బంధించడం, విడిచిపెట్టడం. ఈ మూడు ప్రక్రియలే ప్రాణాయామం. ముక్కుతో గాలిని పీల్చడాన్నే శ్వాసించడంగా పరిగణిస్తాం. 

కొందరు ముక్కుతో ఒకవైపు నుంచే గాలి పీలుస్తారు. రెండో వైపు నుంచి తక్కువగా శ్వాసిస్తారు. అలాకాకుండా రెండు రంధ్రాల నుంచి సమానంగా శ్వాసిస్తే అనేక నాడులు యాక్టివేట్ అవుతాయి. శరీరంలో ఉండే 72 వేల నాడులు అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముక్కులోని రెండు రంధ్రాల ద్వారా సమానంగా శ్వాసించినపుడు సుష్మనాడి అనేది బాగా పనిచేస్తుంది. అది అతి ప్రధానమైన ఆరు నాడీ కేంద్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగా అనేక రోగాలు నయమవుతాయి. ఇందులో ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌కి వెళితే...గురువులు చెప్పే ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది.


ధ్యానం ఎలా చేయాలంటే.. ఏ లక్ష్యం కోసం చేస్తున్నామనేది ముందు నిర్ణయించుకోవాలి. మానసిక శాంతి కోసమా, ఆరోగ్యం కోసమా?, ఆధ్యాత్మికత కోసమా? అనేది నిర్ణయించుకుని ఆ మేరకు సాధన చేయాలి. సూర్యోదయానికి ముందే ధ్యానం ముగించాలి. రాత్రి పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఆ రోజు నిర్వహించిన కార్యకలాపాలేవీ రాత్రి కలలోకి రావు. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయాలి. సాధారణంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు చేస్తే సరిపోతుంది. వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలనే నిబంధన కూడా ఉంది. అది అభ్యాసంతోనే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక భావనతో చేసేవారికి తప్పనిసరిగా గురువు ఉండాలి. మిగిలిన వారికి అవసరం లేదు. పుస్తకాల్లో లభించే సూచనల మేరకు చేస్తే సరిపోతుంది.మనసును నియంత్రించుకోవడానికి శ్వాసపై దృష్టి పెట్టాలి కాబట్టి, శ్వాసను పీల్చేటపుడు 'సో'' అని, రెండో వైపు నుంచి ఆ గాలిని విడిచిపెట్టేటపుడు 'హం'' అని ఉచ్ఛరించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏకాగ్రత వస్తుంది. ఇలా రోజు అరగంట ధ్యానం చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

 మనసు ప్రశాంతంగా ఉంటుంది.


 మైండ్ కెపాసిటీ పెరుగుతుంది.

దేనిపైనైనా ఏకాగ్రత వస్తుంది.

చేసే పనిలో సామర్థ్యం పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి ఎక్కువవుతుంది.

పలికే మాటలపై అథారిటీ వస్తుంది.

ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే శక్తి లభిస్తుంది.

Popular Posts